Deputy CM Bhatti: చిన్న పొరపాటుకు కూడా అవకాశం ఇవ్వొద్దు

by Gantepaka Srikanth |

2047 నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడమే లక్ష్యంగా రాష్ట్రం ముందుకుపోతున్న క్రమంలో ఈ లక్ష్యసాధనలో పోలీస్ శాఖ పాత్ర కీలకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

Deputy CM Bhatti: చిన్న పొరపాటుకు కూడా అవకాశం ఇవ్వొద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: 2047 నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడమే లక్ష్యంగా రాష్ట్రం ముందుకుపోతున్న క్రమంలో ఈ లక్ష్యసాధనలో పోలీస్ శాఖ పాత్ర కీలకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మొదట హోంశాఖ, తదుపరి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుతో కలిసి పరిశ్రమలు, ఐటీ శాఖల ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులు వస్తున్న నేపథ్యంలో శాంతిభద్రతలు కీలకం అని డిప్యూటీ సీఎం అన్నారు. ఈ అంశంలో ఏ చిన్న పొరపాటుకు హోంశాఖ అధికారులు, సిబ్బంది అవకాశం ఇవ్వరాదని, ప్రతి కదలిక మీ కనుసన్నల్లో ఉండాలని సూచించారు. విధుల నిర్వహణ క్రమంలో హోం శాఖకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.

నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర గణనీయంగా ఉంటుందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సీసీ కెమెరాల వినియోగాన్ని పెద్ద సంఖ్యలో చేపట్టాలని, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని చిన్న కదలికను సైతం వెను వెంటనే గుర్తించి నిఘాను పటిష్టం చేసేందుకు సీసీ కెమెరాల వినియోగాన్ని పెంచాలని, అందుకు అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా తెలిపారు. 41 జీసీసీలతో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, ఇదే వేగాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కల్పిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. డాటా సెంటర్లలో AI వినియోగాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని మంత్రి శ్రీధర్ బాబుకు సూచించారు. ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ CV ఆనంద్, TGIICC MD శశాంక, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story