24 గంటల బొగ్గు తవ్వకం వ్యవస్థపై డిప్యూటీ సీఎం భట్టి పరిశీలన

by Ramesh Naini |

సత్తుపల్లి లోని జలగం వెంగళరావు (JVR) ఓపెన్ మైన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులతో కలిసి పరిశీలించారు.

24 గంటల బొగ్గు తవ్వకం వ్యవస్థపై డిప్యూటీ సీఎం భట్టి పరిశీలన
X

దిశ, డైనమిక్ బ్యూరో: సత్తుపల్లి లోని జలగం వెంగళరావు (JVR) ఓపెన్ మైన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులతో కలిసి పరిశీలించారు. మొదట వ్యూ పాయింట్ నుంచి ఓపెన్ మైన్‌ను పరిశీలించిన డిప్యూటీ సీఎం, అనంతరం మైన్‌లోపలికి వెళ్లి సుమారు రెండు గంటల పాటు విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. ఓపెన్ మైన్ ప్రారంభ ప్రక్రియ, మైన్‌లో ఉన్న పొరలు, బొగ్గు తవ్వకం విధానం, ప్రస్తుతం లభిస్తున్న బొగ్గు రకాలు, తవ్విన బొగ్గును బయటకు తరలించే విధానం, 24 గంటల పాటు మైన్ పనిచేస్తున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు ఉన్న ఏర్పాట్లు వంటి అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అలాగే మైన్‌లో వినియోగిస్తున్న వాహనాల సంఖ్య, శాశ్వత సిబ్బంది, కాంట్రాక్టు సిబ్బంది వివరాలు, వారి వేతనాల చెల్లింపు విధానం, ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న బొగ్గుకు మార్కెట్‌లో ఉన్న ధరలు, రవాణా సమయంలో చేపడుతున్న భద్రతా చర్యలపై డిప్యూటీ సీఎం వివరాలు సేకరించారు. మైన్ పరిశీలన అనంతరం నేరుగా కోల్ డిస్పాచ్ సెంటర్‌ను సందర్శించి, అక్కడి నుంచి బొగ్గు ఎలాంటి ప్రక్రియ ద్వారా, ఏ ఏ ప్రాంతాలకు పంపిణీ అవుతుందనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Next Story