- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే మా లక్ష్యం: డిప్యూటీ CM భట్టి
అభివృద్ధి పథంలో ముందుకు పోతూనే.. యువతకు ఉపాధి చూపే ఉద్యోగాల గనిగా రూపుదిద్దుకోవాలని ఆ దిశగా కార్మికులు

దిశ, తెలంగాణ బ్యూరో: అభివృద్ధి పథంలో ముందుకు పోతూనే.. యువతకు ఉపాధి చూపే ఉద్యోగాల గనిగా రూపుదిద్దుకోవాలని ఆ దిశగా కార్మికులు, అధికారులు సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. మన ముందు తరాల వారు ఆరోగ్యంగా, ఆర్థికంగా బలమైన సింగరేణి సంస్థను మనకు అందించారని, మనం కూడా మన వారసులకు ఉజ్వల సింగరేణిని అందించకపోతే భావి తరాలకు తీరని నష్టం చేసిన వాళ్లం అవుతామని హెచ్చరించారు. సింగరేణి అభివృద్ధిలో కింది ఉద్యోగి నుంచి సీఎండీ వరకు అందరికీ సమాన బాధ్యత ఉంటుందని, సంస్థ ప్రయోజనాల దృష్ట్యా కఠినమైన నిబంధనలు అమలు చేస్తూ ముందుకెళ్లాలని స్పష్టం చేశారు. ఉద్యోగులకు కష్టంగా ఉంటుందని ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల రాబోయే రోజుల్లో ఇబ్బందుల పాలవుతామని, నిబంధనలతో, శ్రమతో కూడిన అడుగులు వేయాలన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్‌లో శుక్రవారం సాయంత్రం ఆయన సింగరేణి కారుణ్య నియామకాల వయో పరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచడం వల్ల లబ్ధి పొందిన వారసులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
కారుణ్య ఉద్యోగాలలో గరిష్ట వయోపరిమితిని 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచాలని కార్మికులు, కార్మిక సంఘాలు కోరిన ఎదుట దీనిపై తక్షణమే మానవతా దృక్పథంతో స్పందించి అంగీకరించామని, దీనివల్ల 35 సంవత్సరాల వయో పరిమితి దాటిన అనేక వందల మందికి ఉద్యోగాలు లభించే అదృష్టం దక్కిందన్నారు. నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. సింగరేణి సంస్థ నేడు పోటీ మార్కెట్‌టో ఇతరులతో పోటీపడి నిలవాల్సిన పరిస్థితి ఉందని, కనుక సింగరేణి కార్మికులు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుంటూ పూర్తి పనిగంటలు పనిచేస్తూ కంపెనీని కాపాడుకోవాలని భవిష్యత్తు తరాలకు దీనిని ఒక వారసత్వంగా అందించాలన్నారు. సింగరేణిని ఇతర రంగాల్లోకి, ఇతర రాష్ట్రాల్లోకి కూడా విస్తరిస్తున్నామని, ఈ ప్రణాళికలు విజయవంతం కావాలంటే ప్రతీ ఒక్కరూ శ్రమ శక్తిని చాటాలన్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన సింగరేణి వారసులు తేలికపాటి ఉద్యోగం కోసం విఫల ప్రయత్నాలు చేయకుండా, ఇచ్చిన పనిని సమర్థంగా నిర్వహిస్తూ కంపెనీ అభివృద్ధికి తోడ్పడాలన్నారు.
అదే సమయంలో తమ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగులకు పెద్ద ఎత్తున స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో 9 వేల కోట్ల రూపాయలతో చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు రాష్ట్ర అవతరణ దినం జూన్ 2వ తేదీన పత్రాలను అందజేస్తున్నట్లు తెలిపారు. ఇది లక్షల మందికి ఉపాధి లభించే బృహత్ పథకంగా అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి వ్యాప్తంగా సడలించిన వయోపరిమితి ద్వారా కారుణ్య నియామకం పొందిన 21 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ.. సంస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని, దేశంలో ఎక్కడా లేనివిధంగా వయోపరిమితి సడలింపునకు అంగీకరించి, అనేక కుటుంబాల్లో వెలుగు నింపిన రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ప్రాతినిధ్య కార్మిక సంఘం ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్, కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమానికి సహకరిస్తుందని, కాంట్రాక్టు కార్మికులకు కూడా రూ.5 వేల బోనస్ చెల్లించడం జరిగిందన్నారు. దేశంలో ఏ బొగ్గు సంస్థల్లో లేని విధంగా సింగరేణిలో వయో పరిమితిని 40 ఏళ్లకు పెంచడం కూడా ఇక్కడే సాధ్యమైంది అన్నారు. గతంలో ఏ రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి కృషి చేయనివిధంగా తెలంగాణలో మంత్రి భట్టి విక్రమార్క సంస్థ అభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు. ఆయన ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో మరో ఆరు గనులు.. 20వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆశిస్తున్నట్లు జనక్ప్రసాద్తెలిపారు.






