- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జర్మనీతో కలిసి పని చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం.. డిప్యూటీ సీఎం భట్టి కీలక హామీలు

దిశ, డైనమిక్ బ్యూరో: జర్మనీ, భారతదేశం మధ్య సుదీర్ఘకాలంగా స్నేహబంధం కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో ఈ బంధం మరింత పటిష్టంగా ముందుకు సాగాలని ఆశిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ప్రజా భవన్‌లో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి జర్మనీ పార్లమెంట్ బృందంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ బృందాన్ని ఉద్దేశించి డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐటీ, డిఫెన్స్, ఫార్మా రంగాల్లో జర్మనీతో కలిసి పని చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని, తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను జర్మనీకి పంపడానికి ప్రభుత్వం ఆసక్తిగా ఉందని, జర్మనీ ప్రసిద్ధి చెందిన మెటలర్జీ, కార్ల తయారీ రంగంలో జర్మనీతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఉందని జర్మనీ పార్లమెంట్ బృందానికి వివరించారు.
ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సైబర్ సెక్యూరిటీ విషయాల్లో చాలా దూర దృష్టితో సైబర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రం ఏర్పాటు చేశామని, ఈ రంగంలో లోతుగా అధ్యయనం చేస్తున్నామని వివరించారు. సీనియర్ పోలీసు అధికారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ సెల్ ఏర్పాటు చేశామని, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేకంగా రెండు ఫ్లోర్లు సైబర్ సెక్యూరిటీ కోసం కేటాయించామని తెలిపారు.






