పూర్తిచేసేందుకు కట్టుబడి ఉన్నాం.. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్

by Gantepaka Srikanth |

ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి.. వాటిని పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, వీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

పూర్తిచేసేందుకు కట్టుబడి ఉన్నాం.. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి.. వాటిని పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, వీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో సాగునీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ ప్రీ బడ్జెట్ సమావేశంలో వారు పలు అంశాలపై చర్చించారు. ఎస్ఎల్‌బీసీని ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని, ఏఎంఆర్‌పీలో ఐదో పంపు ఏర్పాటు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పూర్తిగా స్టడీ చేసి.. గోదావరి నీటితో పాలేరు రిజర్వాయర్‌ను పరిపుష్టం చేసే పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గోదావరి పరిధిలో బస్వాపూర్ మొదలు సింగూరు వరకు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏదుల నుంచి వట్టెం-ఏదుల కాలువలు గుర్తు చేసుకోవాలని ఆదేశించారు.

డిండి ఎత్తిపోతల పథకం పరిధిలో చివరి దశకు చేరుకున్న ప్రాజెక్టులను పూర్తిచేయడంపై అధికారులు దృష్టి సారించాలన్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో వివిధ ప్రాజెక్టుల కింద ఉన్న భూ సేకరణ, పాత ప్రాజెక్టుల నిర్వహణ, క్యాపిటల్ వర్క్స్‌పై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. సాగునీటి ప్రాజెక్టులను ఆధునికరించుకోవడం, కాలువలకు లైనింగ్ ద్వారా ప్రాజెక్టుల జీవితకాలం పెరుగుతుందని, అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందని మంత్రులు తెలిపారు. పాత ప్రాజెక్టులను కాపాడుకునేందుకు మెయింటెనెన్స్ పనులు చేసుకుంటూనే, కేంద్ర నుంచి వివిధ పథకాల ద్వారా నిధులు రాబట్టేందుకు ఉన్న అవకాశాలను త్వరితగతిన పరిశీలించాలని తెలిపారు.

సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక లీగల్ టీం ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని మీడియం, మైనర్ ప్రాజెక్టుల గేట్ల పరమతులు పూర్తి చేయాలని ఆదేశించారు. గృహ జ్యోతి పథకం కింద 500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, ఈ పథకం నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా పౌర సరఫరాల శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సాగునీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్య దాస్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఈఎన్సీ జనరల్ అనిల్, స్పెషల్ సెక్రెటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్అండ్ఆర్ కమిషనర్ విజయ్ కృష్ణారెడ్డి, ఓఅండ్ఎం ఈఎన్సీ విజయ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story