యూనివర్సిటీలో జర్మన్ లాంగ్వేజ్! జర్మనీ బృందంతో డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

జర్మనీ, భారత్ మధ్య సుదీర్ఘకాలంగా స్నేహబంధం కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో ఈ బంధం మరింత పటిష్టంగా ముందుకు సాగాలని ఆశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

యూనివర్సిటీలో జర్మన్ లాంగ్వేజ్! జర్మనీ బృందంతో డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జర్మనీ, భారత్ మధ్య సుదీర్ఘకాలంగా స్నేహబంధం కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో ఈ బంధం మరింత పటిష్టంగా ముందుకు సాగాలని ఆశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన ప్రజా భవన్ లో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి జర్మనీ పార్లమెంట్ బృందంతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఐటీ, డిఫెన్స్, ఫార్మా రంగాల్లో జర్మనీతో కలిసి పని చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ రంగాల్లో పెట్టుబడులు పెడితే.. తమ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని, కలిసి పని చేద్దామని డిప్యూటీ సీఎం కోరారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను జర్మనీకి పంపడానికి తెలంగాణ ఆసక్తిగా ఉందన్నారు. ప్రసిద్ధి చెందిన మెటలర్జీ, కార్ల తయారీ రంగంలో జర్మనీతో కలిసి పని చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని డిప్యూటీ సీఎం జర్మనీ పార్లమెంట్ బృందానికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోందని, మూసీ పునర్జీవనం, వ్యవసాయ ఆధారిత రంగాలపై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ ఐటీ రంగానికి హబ్ గా వెలుగొందుతోందని, ఈ రంగాల్లో జర్మనీతో కలిసి పని చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్న స్కిల్స్ యూనివర్సిటీలో జర్మన్ లాంగ్వేజ్ విభాగాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని తద్వారా తెలంగాణ విద్యార్థులు జర్మన్ భాష నేర్చుకొని జర్మనీలో పనిచేసేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.

సైబర్ సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యం- ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సైబర్ సెక్యూరిటీ విషయాల్లో చాలా దూర దృష్టితో సైబర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటు చేశామని ఈ రంగంలో లోతుగా అధ్యయనం చేస్తున్నామని జర్మనీ పార్లమెంట్ బృందానికి మంత్రి వివరించారు. సీనియర్ పోలీసు అధికారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ సెల్ ఏర్పాటు చేశామని, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేకంగా రెండు ఫ్లోర్స్ సైబర్ సెక్యూరిటీ కోసం కేటాయించామని తెలిపారు. జిల్లాల్లో కూడా సైబర్ సెక్యూరిటీ బృందాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. ఆర్థిక నేరాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయన్నారు. ఆర్థిక మోసాలను అరికట్టేందుకు ఏఐ టూల్స్ వాడుతున్నట్టు మంత్రి వెల్లడించారు.

రైజింగ్ అద్భుతం...

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ అద్భుతంగా ఉందని జర్మనీ పార్లమెంట్ బృందం రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించింది. ప్రతి రంగంలో సాధించాల్సిన లక్ష్యాలను ఈ విజన్ డాక్యుమెంట్ లో స్పష్టంగా పేర్కొనడం అభినందనీయమని, రాష్ట్ర ప్రగతి పట్ల నిబద్ధతకు ఈ డాక్యుమెంట్ నిదర్శనమన్నారు. సైబర్ సెక్యూరిటీ, స్కిల్ లేబర్ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం కోరుకుంటున్నామని జర్మనీ పార్లమెంట్ బృందం వివరించింది. జర్మనీకి చెందిన పెట్టుబడిదారులు చాలామంది భారత్ లో పెట్టుబడులు పెట్టారని, తమ దేశానికి చెందిన బోష్ వంటి ప్రసిద్ధ కంపెనీలు ఇక్కడ పెద్ద సంఖ్యలో పని చేస్తున్నాయన్నారు. తమ దేశానికి చెందిన ఇంజనీర్లు భారత్ లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్నారని జర్మనీ పార్లమెంట్ బృందం వివరించింది. భారతదేశానికి చెందిన 60 వేల మంది విద్యార్థులు జర్మనీలో వివిధ రకాల కోర్సులను అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు, స్కిల్డ్ లేబర్ కు భారతదేశం, తెలంగాణ రాష్ట్రంలో కొదవలేదని అన్నారు. జర్మనీ బృందంలో ఎంపీలు జోసఫ్ ఓస్టర్, డానియల్ కోల్బిల్, టిజెన్ అటాగ్లు, డా. బెర్న్ డ్ బామన్, ప్రొఫెసర్ లార్స్ కాజెలసీ, లమ్యా కద్దోర్, క్లారా బుంగర్, క్రిస్టినా జీగెనహార్న్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్కో సిఎండి హరీష్, ప్రణాళిక శాఖ సెక్రటరీ బుద్ధ ప్రకాష్ జ్యోతి, అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Next Story