గతంలో గ్రీన్ ఎనర్జీ స్టోరేజీ లేదు.. విద్యుత్ ఉత్పత్తి పెంచకపోతే భారీ నష్టం: డిప్యూటీ సీఎం భట్టి

by Malleboina Mahesh |   (  Updated:2025-11-29 08:44:09  IST  )

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర విద్యుత్ రంగ భవిష్యత్తుపై లోతైన విశ్లేషణను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన విద్యుత్ రంగంపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

గతంలో గ్రీన్ ఎనర్జీ స్టోరేజీ లేదు.. విద్యుత్ ఉత్పత్తి పెంచకపోతే భారీ నష్టం: డిప్యూటీ సీఎం భట్టి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర విద్యుత్ రంగ భవిష్యత్తుపై లోతైన విశ్లేషణను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన విద్యుత్ రంగంపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఇందులో రాష్ట్రం ఎదుర్కోబోయే విద్యుత్ అవసరాలు, గ్రీన్ ఎనర్జీలో గడిచిన పదేళ్ల వైఫల్యాన్ని ఆయన స్పష్టం చేశారు. భారతదేశం 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, రాష్ట్రంలో ఉత్పత్తి రంగాలు (Industry) అభివృద్ధి చెందడం అత్యవసరం అని, దీనికి అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచాల్సిన ఆవశ్యకత ఉందని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా వివరించారు. ముఖ్యంగా, మూసీ నది ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీల నిర్మాణం, భారీ అంతర్జాతీయ పెట్టుబడులు, డేటా సెంటర్ల ఏర్పాటు వంటి ప్రణాళికలతో హైదరాబాద్ నగరం గ్లోబల్ హబ్‌గా రూపాంతరం చెందుతోందని, దీనికి భారీ విద్యుత్ మద్దతు అవసరమని ఆయన పేర్కొన్నారు.

భట్టి విక్రమార్క ప్రకారం, రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పదేళ్లుగా విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుత అంచనా ప్రకారం, 2047 నాటికి రాష్ట్రానికి సుమారు 39,000 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది. రాబోయే కొద్ది సంవత్సరాలలో విద్యుత్ సరఫరాలో లోటు ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. తాజా లెక్కల ప్రకారం, 2027-28 వరకు థర్మల్ పవర్ సరఫరాలో పెద్దగా ఇబ్బంది లేకపోయినా, 2029-30 నాటికి రాష్ట్రం సుమారు 1,000 మెగావాట్ల విద్యుత్ లోటులోకి వెళ్లే అవకాశం ఉందని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే, భవిష్యత్తులో ఇబ్బందులను నివారించడానికి తక్షణమే విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

అలాగే ప్రస్తుతం "తెలంగాణలో వాడే విద్యుత్‌లో కనీసం 50 శాతం గ్రీన్ ఎనర్జీ ని వినియోగించాలి" అని లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలిపారు. గత పదేళ్లుగా గ్రీన్ ఎనర్జీ స్టోరేజీ (Energy Storage) వ్యవస్థపై దృష్టి సారించకపోవడం పెద్ద లోపమని ఆయన విమర్శించారు. సోలార్ (Solar), థర్మల్ (Thermal), విండ్ పవర్ (Wind Power) స్టోరేజీలో తెలంగాణ వెనుకబడి ఉండగా, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ (AP) ఈ విషయంలో ఇప్పటికే ప్రణాళికలు ప్రారంభించిందని గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నివేదికలు తెప్పించుకుని అధ్యయనం చేశామని, గ్రీన్ ఎనర్జీ స్టోరేజీకి అనుకూలమైన తెలంగాణలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు త్వరలోనే సమగ్ర ప్రణాళికను అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Next Story