- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అది కేవలం కాగితం కాదు.. ఒకరి జీవితాన్ని మార్చే శక్తి: భట్టి విక్రమార్క
మీరు సంతకం చేసే ప్రతి ఫైలు వెనుక ఒక సామాన్యుడి ఆశ ఉంటుంది. ఆ ఫైలును కేవలం కాగితంలా చూడకండి.. అది ఒకరి జీవితాన్ని మార్చే శక్తి అని గుర్తుంచుకోండి అని నూతనంగా ఎంపికైన గ్రూప్-1 అధికారులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మీరు సంతకం చేసే ప్రతి ఫైలు వెనుక ఒక సామాన్యుడి ఆశ ఉంటుంది. ఆ ఫైలును కేవలం కాగితంలా చూడకండి.. అది ఒకరి జీవితాన్ని మార్చే శక్తి అని గుర్తుంచుకోండి అని నూతనంగా ఎంపికైన గ్రూప్-1 అధికారులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్ హెచ్ఆర్ డీ)లో ఆరు వారాల పాటు జరిగిన గ్రూప్-1 ఫౌండేషన్ కోర్స్ (బ్యాచ్-II) ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న 214 మంది అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రజా సేవలో పాటించాల్సిన నైతిక విలువలు, పరిపాలనలో మానవీయ కోణాన్ని మర్చిపోవద్దని డిప్యూటీ సీఎం దిశానిర్దేశం చేశారు. పరిపాలనలో వేగం పెరగాలని, ప్రతి నిర్ణయం పేదవాడి దరి చేరాలని అధికారులకు సూచించారు. వ్యవస్థలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి, కానీ అందులో పనిచేసే వ్యక్తులు చూపే సానుభూతి మాత్రమే మార్పును తెస్తుందన్నారు. ఫైళ్లు, సమీక్షల హడావుడిలో పడి సామాన్యుడిని విస్మరించవద్దని, రైతు సాయం, విద్యార్థి స్కాలర్‌షిప్, రోగి ఆరోగ్యం మీ కలంపైనే ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోవాలన్నారు. నేటి ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా అనలిటిక్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పాలనలో వాడుకోవాలని, అయితే సాంకేతికత ఎన్నటికీ 'మానవత్వం'తో కూడిన సానుభూతిని భర్తీ చేయలేదని గుర్తుచేశారు.
సీఎం రేవంత్ రెడ్డి కానీ సహచార క్యాబినెట్ మంత్రులు అధికారాన్ని అనుభవించడం కోసం పనిచేయడం లేదని , ఆ అధికారాన్ని ఒక ఆయుధంగా మలుచుకుని కోట్లాది మంది తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంపొందించి, వారి భవిష్యత్తుకు భరోసానివ్వడమే తమ అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వం విద్య, వైద్యం మరియు మౌలిక సదుపాయాల కల్పనపై భారీగా పెట్టుబడులు పెడుతోందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థలు, రెసిడెన్షియల్ పాఠశాలలు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించి మిమ్మల్ని ఈ ఉన్నత స్థితికి తీసుకొచ్చాయని, ఆ వ్యవస్థ పట్ల కృతజ్ఞతతో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎం సి హెచ్ ఆర్ డి జనరల్ డైరెక్టర్ శాంతి కుమారి, కోర్సు డైరెక్టర్ అరుణ్ కుమార్, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.






