ఎస్సీ గురుకులాల్లో ‘డిప్యూటేషన్’ దందా.. అధికారుల పెత్తనంతో అస్తవ్యస్తం!

by Kema Shiva Kumar |

తెలంగాణ ఎస్సీ గురుకులాల్లో డిప్యూటేషన్ అధికారుల పెత్తనం మితిమీరుతోంది.

ఎస్సీ గురుకులాల్లో ‘డిప్యూటేషన్’ దందా.. అధికారుల పెత్తనంతో అస్తవ్యస్తం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్సీ గురుకులాల్లో వరుసగా కార్యదర్శులు మారుతుండటంతో ఆ సంస్థలో డిప్యూటేషన్ పద్ధతిలో పని చేస్తున్న అధికారుల పెత్తనం కొనసాగుతున్నదని ప్రచారం జరుగుతున్నది. కీలకమైన నిర్ణయాలు అన్ని వారు కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అడ్మిషన్ల ప్రక్రియ మొదలుకుని అడ్మిస్ట్రేషన్ వరకు సదరు అధికారుల ఆదేశాల మేరకు నడుస్తున్నట్లు తెలుస్తున్నది. కొన్నిసార్లు కొత్తగా వచ్చిన సెక్రెటరీలకు తప్పుడు ఫీడ్ బ్యాక్ ఇచ్చి బురిడీ కొట్టిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది.

రెండున్నరేళ్లలో నలుగురు సెక్రెటరీలు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ఇప్పటికే నలుగురు సెక్రెటరీలు మారారు. దీంతో కొత్తగా బాధ్యతలు తీసుకున్న సెక్రెటరీ ఎంత కాలం పనిచేస్తారో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇలాంటి పరిస్థితుల్లో సంస్థలో పని చేస్తున్న కిందిస్థాయి అధికారుల చేతుల్లోకి కీలకమైన ఫైల్స్ వెళ్తుండగా.. వారు తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా సదరు అధికారులు కొన్ని సార్లు సెక్రెటరీలకు సైతం తప్పుడు సమాచారం ఇచ్చి బురిడీ కొట్టిస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. అయితే తప్పును గమనించి సమస్యను పరిష్కరించేందుకు సెక్రెటరీలు నడుం బిగించేలోపు ప్రభుత్వం వారిని అక్కడి నుంచి తప్పిస్తున్నట్లు పేరెంట్స్, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ గురుకులాల్లో పనిచేయాలని చిత్తుశుద్ధి, తపన ఉన్న అధికారులను సెక్రెటరీలుగా నియమించాలని, హెడ్ ఆఫీసులో కొనసాగుతున్న అక్రమాలకు చెక్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

డిప్యూటేషన్ అధికారులదే హవా

విద్యార్థులకు ప్రయోజనం కలిగించే అంశాలను పక్కన పెట్టి తమకు లబ్ధి చేకూరే అంశాలపైనే అధికారులు ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. డిప్యూటేషన్ పద్ధతిలో వచ్చిన ఓ ఆఫీసర్ కు అడ్మిస్ట్రేషన్, ఫైనాన్స్ విభాగాల బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వస్తున్నాయి. ఫైనాన్స్ అంశాల్లో ఎలాంటి అనుభవంలేని సదరు ఆఫీసర్ కు ఆ విభాగం బాధ్యతలు అప్పగించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్య సోషల్ మీడియా వింగ్‌లో కొందరిని నియమించారని, అందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండానే విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇప్పించేందుకు ఒక అథ్లెట్ కు ప్రతి నెల రూ. లక్షన్నర జీతంతో నియమించారని ప్రచారం జరుగుతున్నది. టీచింగ్ స్టాఫ్ కు సంబంధించిన ఫైల్స్ క్లియరెన్స్ కోసం పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ప్రతియేటా వేలాది సీట్లు ఖాళీ

సుమారు పదిహేనేళ్లుగా అడ్మిషన్ వింగ్ బాధ్యతలు ఒకే ఆఫీసర్ కనుసన్నల్లో నడుస్తుండడంతో ఆ విభాగంలో జరిగే తప్పిదాలను ప్రశ్నించేవారు లేకుండాపోయారనే టాక్ ఉంది. నాలుగైదు ఏళ్లుగా నిర్ణీత సమయంలో అడ్మిషన్లు పూర్తి చేయకపోవడంతో ప్రతి ఏటా ఇంటర్ కాలేజీల్లో వేలాది సీట్లు ఖాళీగా ఉంటున్నాయని ఆరోపణలు ఉన్నాయి. టెన్త్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఇంటర్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ మొదలు పెట్టాలి. కానీ ఆ విధంగా చేయకుండా.. కాలయాపన చేస్తుండటంతో స్టూడెంట్స్ ప్రైవేటు కాలేజీల్లోకి వెళ్తున్నారనే టాక్ ఉంది.

కీలక టైమ్‌లో సెలవుల్లో సెక్రెటరీ

ప్రస్తుతం గురుకులాల్లో అడ్మిషన్ల ప్రక్రియ నడుస్తున్నది. ఈ ఏడాది నుంచి సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్ మెంట్ ద్వారా పిల్లలకు కావాల్సిన కిట్స్, షూ, డ్రెస్సులు, గ్రాసరీస్ ను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ కీలక ప్రక్రియకు ఎస్సీ గురుకులాల సొసైటీని నోడల్ ఎజెన్సీగా నియమించింది. కానీ రెగ్యులర్ సెక్రెటరీ విజయేంద్ర సెలవుపై వెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి. గురుకులాల్లో నిబద్ధతతో పనిచేస్తారనే ఉద్దేశ్యంతో ఆమెకు బాధ్యతలు అప్పగించారు. కానీ కీలక సమయంలో ఆమె సెలవుపై వెళ్లడంతో విజయేంద్రకు ఎస్సీ గురుకులాల్లో పనిచేయాలనే ఇంట్రెస్ట్ అసలు ఉందా? లేదా? అనే చర్చ జరుగుతున్నది.

పైరవీలతో హెడ్ ఆఫీసులో తిష్ట

ఎస్సీ గురుకులాల్లో రూల్స్ గిల్స్ జన్తా నహీ.. వీళ్లు చెప్పిందే వేదం.. చేసిందే రూల్స్‌గా చలామణి అవుతున్నారు. ‘నీకు నేను..నాకు నువ్వు’ అన్న చందంగా ఇద్దరు జాయింట్ సెక్రటరీలు ఆడిందే ఆట.. పాడిందే పాటగా నడుస్తున్నది. అర్హతలేకున్నా పైరవీలతో పోస్టింగ్ తెచ్చుకుని అక్కడ తిష్ట వేశారు. వీరుద్దరు ఒక్కటిగా ఏర్పడి, కొత్తగా వచ్చిన ప్రతి సెక్రటరీని తప్పుదోవ పట్టించడంతోపాటు అక్రమాలకు పాల్పుడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ సైతం అమలు కావడంలేదు. దీనిపై విచారణ జరిపించాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు. టీచింగ్ ఫ్యాకల్టీగా ఎంపికైన వ్యక్తులు తమకు ఉన్న పలుకుబడితో డిప్యూటేషన్ పద్దతిలో హెడ్ ఆఫీసులో తిష్టవేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి.

Next Story