- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నియోజకవర్గాల పునర్విభజనపై స్పందించిన కేటీఆర్.. ఎక్స్‌లో ఆసక్తికర వ్యాఖ్య
నియోజకవర్గాల పునర్విభజనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై చర్చ ముదురుతున్న వేళ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికరంగా స్పందించారు. ఈ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించేది లేదని, అవసరమైతే బలమైన ప్రజా ఉద్యమం వస్తుందని మూడేళ్ల క్రితమే చెప్పినట్లు.. పాత పోస్టును ట్యాగ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై 2023 సెప్టెంబరులో తాను చేసిన ‘ఎక్స్’ (ట్విట్టర్) పోస్టును కేటీఆర్ తాజాగా రీ-ట్వీట్ చేశారు. "నియోజకవర్గాల పునర్విభజనపై మూడేళ్ల క్రితమే బీఆర్ఎస్ తన స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు" అని ఆయన స్పష్టం చేశారు. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచితే, దశాబ్దాలుగా జనాభా నియంత్రణ పాటిస్తూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆ పోస్టులో ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిని, ఆకాంక్షలను దిల్లీ పాలకులు వింటారని, తమ వాదనలోని న్యాయాన్ని గుర్తిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియను 2011 జనాభా లెక్కల ప్రకారం చేపడుతుందా లేక తాజా లెక్కలను తీసుకుంటుందా అన్న ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో కేటీఆర్ చేసిన ఈ పోస్ట్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు, లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కు పెరుగుతాయని అంచనాలు ఉన్నప్పటికీ, జాతీయ స్థాయిలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందని బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.






