- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాగని సాగు... ఎల్ నినో ప్రభావంతో వర్షాల ఆలస్యం
వానాకాలం మొదలై నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క గట్టి వాన పడలేదు. వాతావరణ సంస్థలు హెచ్చరించినట్టుగానే ఈ సీజన్‌పై ఎల్ నినో పంజా ప్రభావం చూపుతున్నది.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : వానాకాలం మొదలై నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క గట్టి వాన పడలేదు. వాతావరణ సంస్థలు హెచ్చరించినట్టుగానే ఈ సీజన్‌పై ఎల్ నినో పంజా ప్రభావం చూపుతున్నది. ఆ ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫలితంగా పంటల సాగు ముందుకు కదలడం లేదు. ఇప్పటికే ముమ్మరంగా సాగాల్సిన సాగు పనులు.. మందకొడిగా సాగుతున్నాయి. విత్తనాలు వేసేందుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు. పత్తి రైతులు మాత్రం అదును దాటిపోతుందనే ఆతృతతో తొలి జల్లులతో విత్తనాలు విత్తి ఇప్పుడు వాన కోసం ఎదురుచూస్తున్నారు. కొన్నిచోట్ల ముందుగా విత్తనాలు వేసిన రైతులు వాటిని కాపాడుకొనేందుకు ట్యాంకర్లు, బిందెలతో నీళ్లు పోసి పంటను కాపాడేందుకు యాతన పడుతున్నారు. ఎల్ నినో ప్రభావం కారణంగా ఉమ్మడి జిల్లాలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడం లేదు. దీంతోవానాకాలం సాగు పనులు మందగించాయి. సాధారణంగా ప్రతి వానాకాలం సీజన్ లో జూలై చివరి వారంలోపు వరి నాట్లు దాదాపు పూర్తవుతాయి. కానీ ఈసారి వర్షాభావ పరిస్థితుల కారణంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోఅనేక ప్రాంతాల్లో ఇంకా వరి నాట్లు కొనసాగుతూనే ఉన్నాయి.
7.50 లక్షల నుండి 8 లక్షల ఎకరాల వరకు వరి సాగు..
ఉమ్మడి జిల్లాలో ప్రతి ఏడాది వానాకాలం ఖరీఫ్ సీజన్‌లో సుమారు 7.50 లక్షల ఎకరాల నుంచి 8 లక్షల ఎకరాల వరకు వివిధ పంటలు సాగవుతాయి. ఇందులో వరి ప్రధాన పంటగా ఉండగా, సుమారు 4.50 లక్షల నుంచి 5 లక్షల ఎకరాల వరకు వరి సాగు జరుగుతోంది. అదనంగా పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, కంది తదితర పంటలు కూడా విస్తృతంగా సాగు చేస్తారు. వరిలో కూడా ఎక్కువ విస్తీర్ణంలో సన్నాలనే రైతులు సాగు చేస్తున్నారు.
సాధారణ స్థాయికి కూడా చేరని వర్షపాతం..
ఈ ఏడాది జూన్ నెల నుంచి ఇప్పటివరకు నమోదైన వర్షపాతం సాధారణ స్థాయికి చేరుకోకపోవడంతో సాగు విస్తీర్ణం లక్ష్యానికి దూరంగా ఉంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమవడం, మధ్యమధ్యలో మాత్రమే వర్షాలు చిరు జల్లుల మాదిరిగా కురవడం వల్ల నేలలో తేమ నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో ఇప్పటికే విత్తనాలు వేసిన వ్యవసాయ క్షేత్రాల్లో మొలకలు సరిగా రాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు తిరిగి విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
జిల్లాల వారీగా వరి సాగు..
నిజామాబాద్ జిల్లాలో సుమారు 2.20 లక్షల నుంచి 2.40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో రైతులు వరి పంటలు సాగు చేస్తుండగా, కామారెడ్డి జిల్లాలో సుమారు 2.30 లక్షల నుంచి 2.50 లక్షల ఎకరాల్లో వరిని పండిస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లో పండే వరి ఉత్పత్తులు రాష్ట్రంలో జరిగే వరి ఉత్పత్తిలో కీలక స్థానంలో ఉన్నాయి. ముఖ్యంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని మండలాల్లో వరి సాగు ఎక్కువగా ఉంటుంది.
నీటి లభ్యతపై రైతుల్లో ఆందోళన..
ఉత్తర తెలంగాణా వర ప్రదాయనిగా పేరున్న ఎస్సారెస్పీ, అలీసాగర్, పోచారం, నిజాంసాగర్ ప్రాజెక్టులతో పాటు, ఉమ్మడి జిల్లాలోని సాగునీటి వనరులు, చెరువులపై ఆధారపడి రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ఈసారి ప్రాజెక్టుల ఎగువ ప్రాంతాల్లో కూడా తగిన వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో పెరగడంలేదు. చెరువులు, కుంటలు కూడా పూర్తిస్థాయిలో నిండకపోవడం గ్రామీణ ప్రాంత రైతుల ముఖాల్లో తీవ్ర ఆందోళన కనిపిస్తోంది. వ్యవసాయంపైనే ఆధార పడి జీవనం కొనసాగిస్తున్న రైతు కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. వారంతా మొగులుకు మొఖం వేసి మేఘాల వైపు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇంకా పూర్తికాని నాట్లు..
ప్రతి ఏడాది వానాకాలం సీజన్ లో ఈ సమయానికి రైతుల పంట పొలాల్లో వరి నాట్లు దాదాపు పూర్తవుతాయి. కానీ, ఈసారి ఇంకా అనేక మండలాల్లో నాట్లు వేయడం పూర్తి కాలేదు. మరికొన్ని రోజుల్లో మంచి వర్షాలు, భారీగా కురవకపోతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం తగ్గడమే కాకుండా, రాష్ట్ర స్థాయిలో ప్రతిసారీ అధిక విస్తీర్ణం పండించే రికార్డును కూడా సొంతం చేసుకునే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంటున్నారు.
మున్ముందు పరిస్థితి ఎలా ఉండొచ్చు?
రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే జూలై చివరి వారం, ఆగస్టు మొదటి వారంలో వర్షాలు మెరుగుపడి సాగు పనులు వేగం పుంజుకునే అవకాశం ఉంది. అయితే ఎల్నినో ప్రభావం కొనసాగితే మాత్రం వర్షాలు అసమానంగా కురిసి, వరి నాట్లు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదనే అభిప్రాయాలు వ్యవశాఖ వ్యక్తం చేస్తోంది. అప్పుడు రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాల్సిన పరిస్థితి రావొచ్చని అధికారులు చెబుతున్నారు
ప్రత్యామ్నాయ పంటలపై సూచనలు
వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగయ్యే కంది, పెసర, నువ్వులు వంటి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. జూలై చివరి వారం, ఆగస్టు మొదటి వారంలో మంచి వర్షాలు కురిస్తేనే ఖరీఫ్ సాగు పూర్తిస్థాయిలో గాడిన పడే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






