డాక్యుమెంట్ రైటర్లదే హవా!

by Jakkula.Mamatha |

ఉమ్మడి జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇప్పటికీ భూముల రిజిస్ట్రేషన్ లో మార్పు లేదు.

డాక్యుమెంట్ రైటర్లదే హవా!
X

దిశ, వరంగల్ బ్యూరో: ఉమ్మడి జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇప్పటికీ భూముల రిజిస్ట్రేషన్ లో మార్పు లేదు. నేటికీ బ్రోకర్ల ప్రమేయమే కొనసాగుతోంది. అంతా ఆన్ లైన్ అయినా వారు లేనిదే ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. రిజిస్ట్రేషన్ చేసుకునే వారి నుంచి వేల రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారు. బ్రోకర్లు లేకుండా రిజిస్ట్రేషన్ కోసం నేరుగా వెళ్లే వారికి ఏదోక కొర్రీ పెడుతూ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ, విజిలెన్స్ దాడులు జరిగినా, అధికారులను సస్పెండ్ చేసిన మార్పు మాత్రం లేదు. కొత్త వారిని నియమించినా ఇప్పటికీ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లే చక్రం తిప్పుతున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఇళ్లు, భూములు, ప్లాట్స్, మార్టిగేజ్, ఇతర రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. నిత్యం వందల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. చార్జీల రూపంలో ప్రభుత్వానికి ప్రతినెల కోట్ల రూపాయలు వస్తున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా రిజిస్ట్రేషన్లు అన్నీ ఆన్ లైన్లో జరుగుతున్నాయి. భూముల కొనుగోలు, క్రయవిక్రయాలు అన్ని రిజిస్ట్రేషన్లు ఆన్ లైన్ లో జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఆన్ లైన్ ఎంట్రీ చేసి ఫీజులు చెల్లించి స్లాట్ బుక్ చేస్తే ఆ రోజు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ కు ముందు రిజిస్ట్రేషన్లు మాన్యువల్ గా జరిగేవి. అప్పుడు అంతా డాక్యుమెంట్లు డాక్యుమెంట్ రైటర్ల ఆధ్వర్యంలో జరిగేవి. వారికి కమిషన్ ఇచ్చేవారు. ఆన్ లైన్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ రైటర్లకు పనిలేకుండా పోయింది. ప్రభుత్వం వారిని ఎత్తివేసింది.

అయినా ఇప్పటికీ వారు లేనిదే పని కావడం లేదు. ప్రతి డాక్యుమెంట్ వారి ద్వారానే చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్లు కూడా వారితో లోపాయికరి ఒప్పందం చేసుకున్నారు. డాక్యుమెంట్ విలువ ను బట్టి కమిషన్ వసూలు చేస్తున్నారు. నిత్యం వేల రూపాయలు సంపాదిస్తున్నారు. అధికారులకు వాటా ఇస్తూ యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. హన్మకొండ లోని వడ్డేపల్లి, ఖిల్లా వరంగల్, వరంగల్ రూరల్, భీమదేవరపల్లి, స్టేషన్ ఘన్​పూర్, జనగామ, నర్సంపేట, వర్ధన్నపేట, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, పరకాలలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి చుట్టూ ఎక్కడ చూసినా డాక్యుమెంట్​రైటర్ల షాపులు దర్శనమిస్తాయి. వీటి ద్వారానే డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు.

ఏసీబీ దాడులు జరిగినా మారని తీరు..

హన్మకొండ వడ్డెపల్లిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మూడు నెలల క్రితం ఏసీబీ దాడులు చేయడంతో పాటు ఇద్దరు అధికారులను పట్టుకున్నారు. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ పూర్తయిన 250 డాక్యుమెంట్లు వారి వద్దనే ఉంచుకున్నట్లు ప్రభుత్వానికి నివేదించారు. వారి స్థానంలో కొత్త సబ్ రిజిస్ట్రార్లను నియమించిన ఫలితం లేదు. పాత పద్ధతిలోనే యదావిధిగా కొనసాగుతుంది. ఏసీబీ, విజిలెన్స్ దాడులు కావడంతో తాత్కాలికంగా ప్రధాన గేట్లను మూసివేశారు. వేరే గేటును తెరిచి రాకపోకలను సాగిస్తూ వాస్తు పేరు మీద కొత్త గేట్లను ఏర్పాటు చేసి ఉపయోగిస్తున్నారు. ఈ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఎక్కువగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరుగుతాయి. మూడు నెలల క్రితం ఇక్కడ జరిగిన ఏసీబీ తనిఖీల్లో భారీగా అవకతవకలు బయటపడ్డాయి. ఫోన్ పేలు, నేరుగా క్యాష్ వసూలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వారిపైన కేసులు నమోదు చేశారు. కొంత మంది డాక్యుమెంట్ రైటర్ల పైన కూడా కేసులు పెట్టారు.

పది పదిహేను రోజులు కార్యాలయం బయట ఉన్న డాక్యుమెంట్ రైటర్ల షాపులను మూసి వేశారు. కొత్త స్టాఫ్ రాగానే మళ్లీ యధావిధిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ లన్నీ వారి కనుసన్నల్లోనే జరిగే విధంగా చూసుకుంటున్నారు. అధికారులు కూడా వారి ద్వారానే ఎక్కువగా జరిగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లు వారికి సంబంధించిన డాక్యుమెంట్లపైన ప్రత్యేకంగా పెన్సిల్ తో పైన గీతలు పెట్టి వాటి ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. పది పదిహేను రోజులు ఉన్నతాధికారులు పర్యవేక్షించిన ఆ తర్వాత పట్టించుకోకపోవడం వల్ల యదావిధిగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టిన వారి ఆధ్వర్యంలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.

ఉమ్మడి జిల్లాలో ఏ కార్యాలయం చూసిన వారి ప్రమేయం లేకుండా జరగడం లేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో మెజార్టీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తనిఖీలు చేశారు. అయినా ఫలితం మాత్రం లేదు. ఎన్ని తనిఖీలు చేసిన పరిస్థితి మాత్రం ముందుకు సాగడం లేదు. ఇప్పటికీ డాక్యుమెంట్ రైటర్లదే హవా కొనసాగుతోంది. చాలా కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లకు ఇన్​చార్జి సబ్ రిజిస్ట్రార్ గా నియమించడంతో ఇష్టం వచ్చిన రీతిలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కొన్ని కార్యాలయ పరిధిలో ప్రభుత్వ భూములను బినామీ, దొంగ డాక్యుమెంట్లతో రిజిస్టర్ చేశారు. కొంతమంది పై కేసులు నమోదు చేయడంతో పాటు చర్యలు తీసుకుంటున్నారు. ఈ కేసుల్లో వేల నుంచి లక్షల రూపాయలు చేతులు మారాయి. ఉన్నతాధికారులు దృష్టి పెట్టి ప్రత్యేక చర్యలు చేపడితే తప్ప ఇది ఆగే పరిస్థితి లేదు. అధికారులు మాత్రం అంతా ఆన్ లైన్ లో బ్రోకర్ల ప్రమేయం లేకుండా జరుగుతున్నట్లు తెలిపారు. ఆన్ లైన్ లో బుక్ చేసిన స్లాట్ ప్రకారమే రిజిస్ట్రేషన్ చేస్తున్నామని చెబుతున్నారు.

Next Story