- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈసీల నియామకంలో జాప్యం..వర్శిటీల్లో పోస్టుల భర్తీకి బ్రేక్
రాష్ట్రంలోని పలు యూనివర్శిటీల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీల నియామకంలో జాప్యం జరుగుతోంది. దీంతో పలు వర్శిటీలు విధాన పరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి.

దిశ,తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పలు యూనివర్శిటీల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీల నియామకంలో జాప్యం జరుగుతోంది. దీంతో పలు వర్శిటీలు విధాన పరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి. ప్రధానంగా ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి బ్రేక్ వేసినట్టు అయ్యిందనే విమర్శలున్నాయి. త్వరలో వర్శిటీల్లో అకడమిక్ ఇయర్ ప్రారంభం కానుంది. ఈలోపు ఎగ్జిక్యూటివ్ కమిటీలను నియమిస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభిస్తుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందనే విమర్శలున్నాయి.
ఈసీ ఏర్పాటు తర్వాతే కొత్త ఉద్యోగాలు
పలు వర్శిటీల్లో ఎగ్జిక్యూటీవ్ కమిటీలను నియమించిన తర్వాతే టీచింగ్ స్టాఫ్ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ లభించనుంది. ఎందుకంటే కొత్త రిక్రూట్‌మెంట్ చేయాలంటే తప్పకుండా ఈసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వెంటనే ఎగ్జిక్యూటివ్ కమిటీలను నియమించాలని పలు వర్శిటీలు.. విద్యాశాఖ సెక్రెటరీ యోగితారాణాకు విజ్ఞప్తి చేసినా ఎలాంటి కదలికా లేదనే ఆరోపణలున్నాయి. వాస్తవంగా వర్శిటీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నాలుగు నెలల క్రితమే కసరత్తు మొదలు పెట్టింది. 12 వర్శిటీల్లో సుమారు 2,100 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించి వెంటనే భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ చాలా వర్శిటీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల స్థానంలో సుమారు 650 మంది కాంట్రాక్టు, పార్ట్ టైమ్ లెక్చరర్లు పని చేస్తున్నారు. వీరంతా పదేండ్ల నుంచి వర్క్ చేస్తున్నారు. వీరిని తొలగించి కొత్త వారిని నియమిస్తే వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉన్నదని గ్రహించిన ప్రభుత్వం కాంట్రాక్టు, పార్ట్ టైమ్ లెక్చరర్లను కొనసాగిస్తూనే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. కానీ ఆ నిర్ణయాలను అమలు చేయాలంటే పాలకవర్గం ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది.






