రాష్ట్రంలో సగం మండలాల్లో లోటు వర్షపాతం.. ఎరువులపై ఎఫెక్ట్

by Malleboina Mahesh |

ఎల్‌నినో ప్రభావం పంటలపైనే కాకుండా ఎరువులపైనా కూడా ఎఫెక్ట్ చూపిస్తోంది. వానలు సకాలంలో కురవకపోవడంతో రైతులు ఆరుతడి పంటల సాగుకు సిద్ధమయ్యారు.

రాష్ట్రంలో సగం మండలాల్లో లోటు వర్షపాతం.. ఎరువులపై ఎఫెక్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల ప్రభావం మెల్లమెల్లగా విస్తరిస్తున్నది. ఎల్‌నినో ప్రభావం పంటలపైనే కాకుండా ఎరువులపైనా కూడా ఎఫెక్ట్ చూపిస్తోంది. వానలు సకాలంలో కురవకపోవడంతో రైతులు ఆరుతడి పంటల సాగుకు సిద్ధమయ్యారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వరినాట్లు ఆలస్యమవడంతో ఈ సీజన్‌లో ఎరువుల వినియోగం భారీగా తగ్గిపోయింది. దీంతో యూరియాకు డిమాండ్ తగ్గింది. సాధారణంగా వరి, పత్తి, మొక్కజొన్న ఇతర పంటలు త్వరగా పెరిగేందుకు యూరియాను విరివిగా ఉపయోగిస్తారు. కానీ ఈసారి నీటి లభ్యత లేకపోవడంతో చాలా మంది రైతులు ఇంకా నాట్లను ప్రారంభించలేదు. సీజన్ ప్రారంభంలో ఎరువులు కొనుగోలు చేసిన రైతులు కూడా తక్కువ విస్తీర్ణంలో సాగు చేపట్టడంతో యూరియాను తక్కువగా వినియోగిస్తున్నారు. తగ్గిన డిమాండ్ ఫలితంగా పెద్ద మొత్తంలో యూరియా నిల్వలు అమ్ముడుపోకుండా మిగిలిపోయాయి.

గోడౌన్లలో ఫుల్ స్టాక్..

రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేసిన సుమారు 2.5 లక్షల టన్నుల యూరియా ప్రభుత్వ గోడౌన్‌లు, డీలర్ అవుట్‌ లెట్లలో సిద్ధంగా ఉన్నది. రోజుకు దాదాపు 3,850 టన్నుల యూరియాను ఉత్పత్తి చేసే ఆర్‌ఎఫ్‌సీఎల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రకు ఎరువులు సరఫరా చేస్తున్నది. విక్రయాల్లో తెలంగాణ 60 నుంచి 65 శాతం వాటా కలిగి ఉంది. ఖరీఫ్ సీజన్‌లో అధిక డిమాండ్‌ను అంచనా వేసి రాష్ట్రానికి ఏప్రిల్, మే, జూన్​నెలల్లో నెలవారీగా రెండు లక్షల మెట్రిక్​టన్నుల చొప్పున కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసింది.

జులైలో 77.23వేల సంచులు నిల్వలు ఉండగా రిటైర్ల వద్ద 17.99 లక్షలు, సొసైటీల వద్ద 5.72 లక్షలు, మార్క్​ఫెడ్​ వద్ద 51.08 లక్షలు, గోదాంల్లో 2.43 లక్షల యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. నల్లగొండ, నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా యూరియా విక్రయాలు జరుగుతున్నాయి. మిగతా జిల్లాలో అడపాదడపా రైతులు కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం. పాయింట్ ఆఫ్ సేల్ విధానంలో రైతులు ఎరువులు కొనుగోలు చేసిన తర్వాత మాత్రమే కంపెనీలకు సబ్సిడీ విడుదలవుతుంది.

వెలవెలబోతున్న దుకాణాలు..

రాష్ట్ర ప్రభుత్వానికి జూన్, జులై, ఆగస్టు మాసాలు యూరియా సమస్య ఉండేది. వ్యవసాయ శాఖ కేంద్రానికి లేఖలు రాస్తూ నెలకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్​చేసింది. ఓవైపు యూరియా లభించక రైతులు ఆందోళనలు, రైతు వేదికలు, పీఏసీఎస్​కేంద్రాల వద్ద రైతుల క్యూ లైన్లు ఉండేవి. కానీ ఈ వానాకాలంలో యూరియా కోసం ఇబ్బందులు పడే రైతు కనిపించడం లేదు. యాప్​రావడంతో కావాల్సిన రైతులు ముందే కొనుగోలు చేశారు. దానిని కూడా రైతులు పంటల కోసం వినియోగించలేదు.

వర్షాలు కురిస్తే సన్నరకం వరి వేసేందుకు సిద్ధం కాగా ఇప్పటివరకు కొద్దిపాటి చిరుజల్లు తప్ప భారీ వానలు కురవలేదు. దీంతో రైతులు వరి సాగు చేయడం లేదు. ఈ సమయానికి రెండు విడతల యూరియా పంటలకు చల్లేవారు. ఈసారి ఒకసారి కూడా యూరియా వాడలేదు. యాప్​లో మొదటి విడుత బుకింగ్​చేసిన యూరియా తప్ప రెండోసారి బుకింగ్​చేసే చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. యూరియా దుకాణాలు, పీఏసీఎస్​కేంద్రాల్లో బస్తాలు స్టాక్ ​కనిపిస్తుంది. రైతుల కొనుగోలు లేక ఫెర్టిలైజర్ షాపులు వెలవెలబోతున్నాయి.

ఆరుతడి పంటల వైపు మొగ్గు..

రాష్ట్రంలో రైతులు వానాకాలం సీజన్​లో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు పెద్ద మొత్తంలో సాగు చేసేవారు. ఈసారి సకాలంలో వర్షాలు రాకపోవడంతో ఖాళీగా ఉండలేక పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, ఆకుకూరలు సాగు చేశారు. వీటిలో ఎరువుల వాడకం పెద్దగా చేయడం లేదు. దీంట్లో వచ్చే లాభం తక్కువని, పెట్టుబడి దండగ అని పండినంత చాలు అనే భావనతో ఫర్టిలైజర్ల వైపు చూడటం లేదు. యాసంగి సీజన్​లో వానలు కురిస్తే అప్పుడైన వరిసాగు చేస్తామని, ప్రస్తుతం కొనుగోలు చేసిన యూరియాను భద్రపర్చుకుంటున్నారు. ప్రస్తుత యూరియా పత్తి, మొక్కజొన్న, కంది, పెసర పంటలు వేసిన రైతులు మాత్రమే వాడుతున్నారు.

వాన కోసం ఎదురు చూపులేనా?

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. జూన్ 1 నుంచి ఇప్పటివరకు మొత్తం 621 మండలాలకు గానూ 385 మండలాల్లో లోటు వర్షపాతం, 45 మండలాల్లో తీవ్ర లోటు వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 165 మండలాల్లో మాత్రమే నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జిల్లాల్లో రంగారెడ్డి, నల్లగొండ, ములుగు, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, కామారెడ్డి జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. అలాగే నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బలమైన ఉపరితల గాలులు 30 నుంచి 40 కి.మీ. వేగంతో అక్కడక్కడ వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నది.

Next Story