పోస్ట్ గ్రాడ్యుయేషన్.. ‘మిషన్ 2.0’

by Ajay Maddhiboyina |

పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యలో విప్లవాత్మక మార్పులకు ఉన్నత విద్యామండలి సిద్ధమవుతున్నది. ‘మిషన్ 2.0’ పేరుతో కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నది. ముఖ్యంగా మెరుగైన ఉపాధి (ఎంప్లాయిబిలిటీ) అవకాశాలు కల్పించే లక్ష్యంతోనే ఈ నూతన కోర్సులకు శ్రీకారం చుడుతున్నది.

పోస్ట్ గ్రాడ్యుయేషన్.. ‘మిషన్ 2.0’
X

దిశ, తెలంగాణ బ్యూరో: పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యలో విప్లవాత్మక మార్పులకు ఉన్నత విద్యామండలి సిద్ధమవుతున్నది. ‘మిషన్ 2.0’ పేరుతో కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నది. ముఖ్యంగా మెరుగైన ఉపాధి (ఎంప్లాయిబిలిటీ) అవకాశాలు కల్పించే లక్ష్యంతోనే ఈ నూతన కోర్సులకు శ్రీకారం చుడుతున్నది. పీజీలో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, డిమాండ్ లేని పీజీ కోర్సుల స్థానంలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. ప్రస్తుత మార్కెట్ అవసరాలకు, ఉపాధి అవకాశాలకు పెద్దపీట వేసే కోర్సులు, అలాగే ప్రయోగాలకు, పరిశోధనలకు ప్రాధాన్యతనిచ్చే కోర్సులను రూపొందించాలని మండలి యూనివర్సిటీలకు సూచనలు చేసినట్లు తెలిసింది. డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు వెంటనే ఉద్యోగాలు సాధించేలా వివిధ కోర్సుల్లో అన్ని స్థాయిల్లో సిలబస్ లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. అంతేకాకుండా డిమాండ్ లేని పీజీ కోర్సులను రద్దు చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. పాఠశాల విద్యా తరహాలో డిగ్రీ కాలేజీలను రేషనలైజేషన్ చేయబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే డిగ్రీ సిలబస్ కొంతమేర మార్చామని, వచ్చే విద్యా సంవత్సరం పీజీ, పీహెచ్ డీ సిలబస్ ను మారుస్తామని తెలిపారు.

కొత్తగా డిఫెన్స్, సెక్యూరిటీ కోర్సులు

మిషన్ 2.0లో భాగంగా ఉన్నత విద్యా మండలి ప్రతిష్టాత్మకంగా డిఫెన్స్ ,సెక్యూరిటీ వంటి సరికొత్త కోర్సులను పీజీ స్థాయిలో ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ప్రస్తుతం ప్రవేశపెట్టబోయే కొత్త కోర్సులు, వాటికి సంబంధించిన సమగ్ర సిలబస్ రూపకల్పనపై ఉన్నత విద్యా మండలి దృష్టి సారించింది. దీని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీలతో మార్గదర్శకాలు, సూచనలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతున్నది. వచ్చే మార్చి నెలాఖరు వరకు కోర్సులు, సబ్జెక్టు నిపుణులతో చర్చించి సిలబస్‌పై తుది నిర్ణయం తీసుకుని, ఈ కొత్త కోర్సులను త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని మండలి లక్ష్యంగా పెట్టుకుంది. యూజీసీ సూచనలకు అనుగుణంగా పీజీ కోర్సుల్లో ఈ మార్పులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురావడానికి ఉన్నత విద్యామండలి కసరత్తులు చేస్తున్నది. నేటి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా, అత్యంత డిమాండ్ ఉన్న రంగాల్లో యువతకు నైపుణ్యాలను అందించడమే ప్రధాన ఉద్దేశ్యమని ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు.

ఉద్యోగాలకు సిద్ధం చేసేలా కోర్సులు

సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను ఉద్యోగాలకు సిద్దం చేయాల్సిన అవసరం ఉంది. పీజీ కోర్సులు నిర్వీర్యం కతావడం వల్ల పరిశోధనా శక్తి పడిపోతున్నది. ఓయూలో 58 పీజీ కోర్సులున్నాయి. కొన్ని అనవసరమైన పుడ్ కోర్సులు తీసేయాలనే ప్రతిపాదన ఉంది. కొత్తగా ఎంప్లాయిబిలిటీ ఉన్న కోర్సులు ప్రవేశపెట్టేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. పరిశ్రమల భాగస్వామ్యంతో పీజీ కోర్సులు నిర్వహించాలన్న యూజీసీ సూచనలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది.

:: బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్

Next Story