- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rajnath Singh: ఉగ్రవాదంపై రాజీ పడే ప్రసక్తే లేదు
భారత గౌరవం, భూభాగ సమగ్రత విషయంలో తామెప్పుడూ రాజీ పడలేదని...

దిశ, తెలంగాణ బ్యూరో: భారత గౌరవం, భూభాగ సమగ్రత విషయంలో తామెప్పుడూ రాజీ పడలేదని... పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా దాడులు చేసినప్పుడు ఉగ్రవాదుల మతం ఏమిటో తాము అడగలేదని... ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేశామని.. సాధారణ ప్రజలను, సైనిక స్థావరాలను కాదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన జీటో కనెక్ట్ 2025 కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్స్, 2025లో ఆపరేషన్ సిందూర్ సమయంలోనైనా మరెప్పుడైనా ఇదే విధానంలో మన విధానం ఉంటుందన్నారు. భారతదేశం తన సైనిక, ఆర్థిక శక్తిని పెంచుకోవడం ఇతరులపై ఆధిపత్యం చెలాయించడానికి కాదని.. దేశ సాంస్కృతిక విలువలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలు, మహావీరుడు బోధించిన మానవీయ ఆదర్శాలను కాపాడుకోవడానికేనని రక్షణ మంత్రి స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో శనివారం జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జీఐటీఓ) నిర్వహించిన జీటో కనెక్ట్ కార్యక్రమం ప్రారంభ సెషన్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రక్షణ ఎగుమతులు 2014లో రూ. 600 కోట్లుగా ఉండగా, ప్రస్తుతం రూ. 24,000 కోట్లకు పెరిగాయని తెలిపారు. 2029 నాటికి ఈ ఎగుమతులు రూ. 50,000 కోట్లకు చేరుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తేజస్ యుద్ధ విమానాలు, ఆకాశ్ క్షిపణులు, అర్జున్ ట్యాంకులు, ప్రచండ్ హెలికాప్టర్లు స్వదేశీ సాంకేతికతతో తయారవుతున్నాయని వివరించారు. భారత్ ఇక తన రక్షణ అవసరాలు మాత్రమే తీర్చుకోవడం కాదు... ప్రపంచంలో ఉద్భవిస్తున్న ఆయుధ సరఫరాదారుగా గుర్తింపు పొందుతోందన్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి 97 లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నామని, వాటిలో 64శాతం పైగా స్వదేశీ పరిజ్ఞానం ఉపయోగించినట్లు వివరించారు.
మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా భారత్...
‘ఈరోజు భారత్ బొమ్మల నుంచి ట్యాంకుల వరకు అన్నీ తయారు చేస్తోంది. వేగంగా ప్రపంచ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా ఎదుగుతున్నాం. ఆ రోజు దూరంలో లేదు, భారత్ ‘ఫ్యాక్టరీ ఆఫ్ ది వరల్డ్’గా నిలుస్తుంది. వోకల్ ఫర్ లోకల్’ నుంచి ఇప్పుడు లోకల్ టు గ్లోబల్‌పై దృష్టి సారించాం. మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు స్థానిక వ్యాపారాలను బలోపేతం చేయడంతో పాటు, భారత ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చాయి’ అని కేంద్ర మంత్రి అన్నారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని పేర్కొన్నారు. 2030 నాటికి జీడీపీ 7.3 ట్రిలియన్ డాలర్లను దాటి మూడో స్థానంలోకి వస్తుందని తెలిపారు. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2038 నాటికి కొనుగోలు శక్తి సమానత (పీపీపీ) ప్రాతిపదికన భారత్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా మనం అసాధారణ విజయాలు సాధించామని... పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ దృఢ సంకల్ప నాయకత్వం వల్ల భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని పేర్కొన్నారు.
జైన్ సమాజం కృషి ప్రశంసనీయం..
‘భారత జనాభాలో 0.5 శాతం కన్నా తక్కువే ఉన్నప్పటికీ, దేశ పన్ను వసూళ్లలో జైన్స్ సహకారం 24శాతం వరకూ ఉంది. జైనిజం భారతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని బలోపేతం చేస్తూ, ఆర్థిక పురోగతికి మార్గం సుగమం చేస్తోంది’ అని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. డా.విక్రమ్ సారాభాయి, డా.డి.ఎస్. కోఠారి, డా.జగదీశ్ చంద్ర జైన్, డా.మీనాక్షి జైన్ వంటి మహనీయులను ఆయన గుర్తుచేసుకున్నారు. విదేశాలనుంచి దొంగిలించబడిన 20కిపైగా జైన తీర్థంకర విగ్రహాలను తిరిగి తెప్పించడం, జైన్ గ్రంథాల్లో ఉపయోగించే ప్రాకృత భాషను ‘క్లాసికల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా’గా గుర్తించడం వంటి ప్రభుత్వ కృషిని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మహావీరుడు బోధించిన అహింస, సత్యం, అపరిగ్రహం వంటి విలువలు భారత్ అభివృద్ధి దిశలో మార్గదర్శకాలుగా నిలుస్తాయన్నారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడంలో ఈ ఆధ్యాత్మిక సూత్రాలు పునాది అవుతాయని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.






