- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ ఫేవరెట్ హీరో చెబుతున్నారని పెట్టుబడి పెడుతున్నారా? ఇదే నయా స్కెచ్
టెక్నాలజీ అనేది మానవాళి అభివృద్ధికి ఉపయోగపడాలి.. కానీ అదే టెక్నాలజీ సైబర్ నేరగాళ్ల చేతిలో పడి సామాన్యుల పాలిట శాపంగా మారుతోంది.

- సెలబ్రిటీల ముసుగులో డీప్‌ఫేక్ దోపిడీ
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సైబర్ కంత్రీల నయా స్కెచ్
- ప్రముఖుల ముఖాలు, వాయిస్ తో అచ్చం నిజంలా నకిలీ వీడియోలు
- ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో స్పాన్సర్డ్ యాడ్స్‌గా వైరల్
- యాప్‌లో లాభాలు చూపి.. విత్‌డ్రా అనగానే నిలువునా ముంచేస్తున్న వైనం
- సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి వీడియోలను అస్సలు నమ్మొద్దు
- టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్
దిశ, తెలంగాణ బ్యూరో: టెక్నాలజీ అనేది మానవాళి అభివృద్ధికి ఉపయోగపడాలి.. కానీ అదే టెక్నాలజీ సైబర్ నేరగాళ్ల చేతిలో పడి సామాన్యుల పాలిట శాపంగా మారుతోంది. మొన్నటి వరకు గుర్తుతెలియని లింకులు పంపి, ఫోన్ చేసి ఓటీపీలు అడిగి బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేసిన సైబర్ కంత్రీలు.. ఇప్పుడు రూటు మార్చారు. సామాన్యుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీ సాయంతో డీప్‌ఫేక్ వల విసురుతున్నారు. అచ్చం మనకు తెలిసిన ప్రముఖులు, సెలబ్రిటీలు మాట్లాడుతున్నట్లుగానే నకిలీ వీడియోలు సృష్టించి ఆర్థిక మోసాలకు తెరలేపారు. ఈ డీప్‌ఫేక్ వీడియోలు చూసి నిజమని భ్రమపడి, వారు చెప్పిన యాప్స్‌లో పెట్టుబడులు పెట్టి జీవితకాల సంపాదనను కోల్పోతున్నారు.
మోసగాళ్ల బ్రహ్మాస్త్రం.. డీప్‌ఫేక్
సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఆధునిక సాంకేతికతను వాడుతున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ తదితర సామాజిక మాధ్యమాల్లో నేరగాళ్లు స్పాన్సర్డ్ యాడ్స్ రూపంలో ఈ డీప్‌ఫేక్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. దేశంలో కుబేరులైన వ్యాపారవేత్తలు, ప్రముఖ టీవీ యాంకర్లు, స్టార్ క్రికెటర్లు, సినీ హీరోలు.. గతంలొ ఏదైనా టీవీ షోలో ఇచ్చిన ఇంటర్వ్యూల ఒరిజినల్ వీడియోలను నేరగాళ్లు సేకరిస్తారు. అందులోని వారి ముఖ కవళికలు, పెదాల కదలికలను లిప్ సింక్ ఏఐ డీప్‌ఫేక్ టెక్నాలజీతో మార్చేస్తారు. దానికి తోడు వాయిస్ క్లోనింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా అచ్చం ఆయా సెలబ్రిటీల గొంతును అనుకరిస్తారు. అంటే, ప్రముఖులు ఒకప్పుడు మాట్లాడిన వీడియోకు.. నేరగాళ్లు తమకు కావాల్సిన డైలాగులను జోడించి అచ్చం వాళ్లే మాట్లాడుతున్నట్లుగా నకిలీ వీడియోలను సృష్టిస్తారు.
సామాన్యుల నమ్మకమే.. నేరగాళ్ల పెట్టుబడి
నేను ఈ కొత్త యాప్ ద్వారా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి కోట్లు సంపాదించాను.. నా పర్సనల్ సీక్రెట్ ఇదే. నా ఫాలోవర్ల కోసం ఈ యాప్ లింక్ ఇస్తున్నాను.. మీరు కూడా తక్కువ సమయంలో భారీ లాభాలు పొందొచ్చు. నా మాట నమ్మి ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి అంటూ సెలబ్రిటీలు నేరుగా ప్రజలకు చెబుతున్నట్లుగా ఆ వీడియోల్లో కనిపిస్తుంది. సామాన్య ప్రజలు ఈ వీడియోలను చూసినప్పుడు, తమ అభిమాన హీరోనో లేదా దేశంలోనే పేరున్న వ్యాపారవేత్తో స్వయంగా పెట్టుబడి చిట్కాలను చెబుతున్నారని గుడ్డిగా నమ్మేస్తున్నారు. టీవీల్లో చూసే ప్రముఖులే చెబుతున్నారు కదా అని ఆ వీడియో కింద నేరగాళ్లు ఇచ్చే లింక్‌ను క్లిక్ చేసి నకిలీ ట్రేడింగ్ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.
అత్యాశతో అప్పులు చేసి మరీ లక్షల రూపాయలా పెట్టుబడి
సెలబ్రిటీల వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేయగానే యూజర్లు వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూపుల్లోకి యాడ్ అవుతారు. అక్కడ సైబర్ నేరగాళ్లు ఆ సెలబ్రిటీకి చెందిన మేనేజర్లుగా లేదా స్టాక్ మార్కెట్ నిపుణులుగా పరిచయం చేసుకుంటారు. వారు పంపిన నకిలీ ట్రేడింగ్ యాప్‌లో తొలుత పది వేలు పెట్టుబడి పెట్టగానే.. రెండు రోజుల్లో ఆ యాప్ డ్యాష్‌బోర్డులో అది రూ.50 వేలు అయినట్లుగా కంటికి కనిపిస్తుంది. ఇది నిజమేనని నమ్మిన యూజర్లు.. అత్యాశతో లక్షలాది రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నారు. అప్పులు చేసి మరీ అందులో పోస్తున్నారు. కొన్ని రోజులకు యాప్‌లో వారి పెట్టుబడి ఏకంగా కోట్ల రూపాయలకు చేరినట్లు కనిపిస్తుంది. కానీ, ఆ డబ్బును తమ బ్యాంకు ఖాతాలోకి విత్‌డ్రా ప్రయత్నించినప్పుడు అసలు కథ మొదలవుతుంది. మీ డబ్బు విత్‌డ్రా కావాలంటే 30 శాతం ట్యాక్స్ కట్టాలని, ప్రాసెసింగ్ ఫీజులు కట్టాలని నేరగాళ్లు అదనంగా డబ్బులు వసూలు చేస్తారు. విత్‌డ్రా మాత్రం కానివ్వరు. చివరికి ఫోన్ నంబర్లు బ్లాక్ చేసి పరారవుతారు. అప్పుడు తాము నిలువునా మోసపోయామని బాధితులు గ్రహిస్తున్నారు.
మోసపోతే ఏమాత్రం ఆలస్యం చేయొద్దు.. టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్
సెలబ్రిటీల పేర్లతో వచ్చే ఇటువంటి వీడియోలను చూసి ఆకర్షితులు కావొద్దు..సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియోను నిజమని నమ్మకండి. ఆ వీడియోల్లో ప్రముఖులు ఇచ్చే పెట్టుబడి సూచనలు, చిట్కాలను అసలే పాటించవద్దు. ఏ సెలబ్రిటీ కూడా పనిగట్టుకుని ఒక గుర్తుతెలియని యాప్‌లో పెట్టుబడులు పెట్టాలని అడగరు. ఇది కచ్చితంగా డీప్‌ఫేక్ స్కామ్ అని గుర్తించాలి. ఇలాంటి ఫేక్ వీడియోలు మీ దృష్టికి వస్తే వాటిని నమ్మకపోవడమే కాదు.. వేరే వారికి షేర్ కూడా చేయవద్దు. మీరు షేర్ చేయడం వల్ల అది నిజమే అని నమ్మి నేరగాళ్ల వలలో మరింత మంది చిక్కుకునే ప్రమాదం ఉంది. సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద వీడియోలపై ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ ఏమరుపాటున ఇలాంటి సైబర్ మోసాల బారిన పడి డబ్బులు కోల్పోతే.. వెంటనే గోల్డెన్ అవర్స్ లో 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in జాతీయ సైబర్ క్రైమ్ వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలి. డబ్బులు పంపిన ట్రాన్సాక్షన్ ఐడీలు, చాటింగ్ స్క్రీన్ షాట్లను పోలీసులకు అందజేస్తే కోల్పోయిన డబ్బును ఫ్రీజ్ చేసి తిరిగి రికవరీ చేసే అవకాశం ఉంటుంది.. డీప్‌ఫేక్ టెక్నాలజీ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి.






