TG: హరీశ్ వర్సెస్ మినిస్టర్స్: బడ్జెట్‌పై హాట్ డిస్కషన్

by Gantepaka Srikanth |

బడ్జెట్ చర్చ సందర్భంగా అసెంబ్లీలో మాజీమంత్రి హరీశ్‌రావు వర్సెస్ మినిస్టర్స్ అన్నట్లుగా మారిపోయింది.

TG: హరీశ్ వర్సెస్ మినిస్టర్స్: బడ్జెట్‌పై హాట్ డిస్కషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బడ్జెట్ చర్చ సందర్భంగా అసెంబ్లీలో మాజీమంత్రి హరీశ్‌రావు వర్సెస్ మినిస్టర్స్ అన్నట్లుగా మారిపోయింది. బడ్జెట్‌పై హరీశ్‌రావు మాట్లాడుతూ పలు కీలక ఆరోపణలు చేశారు. ప్రధానంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మీద మాట్లాడుతూ.. 2014-15లో తెలంగాణ ఏర్పడిన కొత్తలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 2,177 కోట్లు ఆదాయం వచ్చిందని.. కేసీఆర్ విజన్, పటిష్టమైన విధానాల వల్ల ఆ ఆదాయం 2023-24 నాటికి ఏకంగా రూ.14,296 కోట్లకు చేరిందని తెలిపారు. అంతేకాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే 2015-16లో 42.5 శాతంతో అద్భుతమైన వృద్ధి రేటు నమోదు చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే 2024-25లో రిజిస్ట్రేషన్ల ఆదాయం రికార్డు స్థాయిలో పాతాళానికి పడిపోయిందని ఆరోపించారు. ఏకంగా మైనస్ 42 శాతానికి పడిపోయి..ఆదాయం కేవలం రూ.8,473 కోట్లు మాత్రమే వచ్చిందన్నారు.

యువతీ యువకులకు శూన్యహస్తమే..

ఈ ఏడాది జనవరి కాగ్ రిపోర్టు ప్రకారం అతి కష్టం మీద రూ.12వేల కోట్లకు చేరుకున్నారని.. 2023-24లో సాధించిన రూ.14,296 కోట్ల ఆదాయాన్ని 2025-26లో కూడా రీచ్ కావడం కష్టంగానే ఉన్నదని పేర్కొన్నారు. మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో యూత్ డిక్లరేషన్‌ పేరిట ఎన్నో హామీలు ఇచ్చి ఓట్లు దండుకున్న కాంగ్రెస్‌.. నాలుగో బడ్జెట్‌లోనూ యువతీ యువకులకు శూన్యహస్తమే చూపిందన్నారు. మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అని మొండి చేయిచూపారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ ఊసే లేదని ఆరోపించారు. ఊరూరు బస్సు యాత్రలు చేసి నిరుద్యోగులను రెచ్చగొట్టారని.. నిరుద్యోగులను పార్టీ కార్యకర్తలుగా మార్చుకొని ఇల్లిల్లూ తిప్పారని పేర్కొన్నారు. నాడు నమ్మించారు, నేడు నిండ ముంచారని పేర్కొన్నారు. అటు.. ఈ ఏడాది బడ్జెట్‌లో ఎక్సైజ్, వ్యాట్ రాబడి రూ.46,941 కోట్లు పెట్టుకున్నారని.. 2024-25 యాక్చువల్స్ 34,603 కోట్లు ఉంటే సుమారు రూ.12,338 కోట్లు ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు. 35.65 శాతం గ్రోత్ సాధ్యమైవుతుందా అని నిలదీశారు. మరో 25వేల కోట్లు అదనంగా లిక్కర్ సేల్స్ పెరుగుతే తప్ప సాధ్యం కాదని.. తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మార్చుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story