నగరం ఉలిక్కిపడే ప్రమాదం.. 17కు చేరిన మృతుల సంఖ్య

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-18 06:34:36  IST  )

చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 17కి చేరింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన నగరమంతా ఉలిక్కిపడేలా చేసింది.

నగరం ఉలిక్కిపడే ప్రమాదం.. 17కు చేరిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ (Gulzar House) అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 17కి చేరింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన నగరమంతా ఉలిక్కిపడేలా చేసింది. కృష్ణా పెరల్స్, మోడీ పెరల్స్ షాపులతో పాటు ఇళ్లకూ మంటలు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఏసీ కారణంగా మంటలు చెలరేగగా స్పాట్ లోనే ముగ్గురు మరణించారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న మరో 14 మంది కూడా మరణించడంతో మృతుల సంఖ్య 17కి చేరింది. ప్రమాద సమయంలో భవనంలో నాలుగు కుటుంబాలు ఉండగా 14 మందిని అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ చేశారు. మంటల కారణంగా ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లినవారిని హుటాహుటిన హిమాయత్ నగర్ అపోలో (Apollo), మలక్ పేట యశోద (Yashoda), ఉస్మానియా ఆస్పత్రులకు (Osmania Hospital) తరలించగా.. చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఊపిరాడక అపోలో ఆస్పత్రిలో ఇద్దరు, యశోద ఆస్పత్రిలో మరో ఐదుగురు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రమాద స్థలికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar).. బాధితుల్ని పరామర్శించారు. రెస్క్యూ ఆపరేషన్లో ఎలాంటి జాప్యం జరగలేదని, ఈ ఘటనపై ఎలాంటి రాజకీయాలు చేయవద్దన్నారు. ప్రమాదాలెప్పుడూ చెప్పి రావని, ఇందులో ప్రభుత్వం నిర్లక్ష్యం లేదని మంత్రి స్పష్టం చేశారు. హైడ్రాకమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath), ఫైర్ డీజీ నాగిరెడ్డి, చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫాఖాన్ అలీ, సౌత్ జోన్ డీసీపీ స్నేహా మిశ్రా, ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

Next Story