- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, తెలంగాణ బ్యూరో: నిన్నటి దాకా ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనుకున్నాం.. కానీ నేడు ‘కల్తీ లేని రోజే మహాభాగ్యం’ అనుకునే దారుణమైన పరిస్థితిలో బతుకుతున్నాం. పాలు మొదలుకొని ప్రాణాలు కాపాడే మందుల వరకు అన్నీ కల్తీయే! ఇటీవల ‘దిశ’ దిన ప్రతిక నిర్వహించిన ప్రజా సర్వేలో వెల్లడైన పచ్చి నిజాలు వింటే, మనం తింటున్నది ఆహారమా లేక విషమా? అనే భయం కలగకమానదు. కల్తీ చేసే వాళ్లను ఉరితీయాల్సిందేనని ప్రజలంతా ముక్తకంఠంతో చెప్తున్నారంటే.. కల్తీపై ప్రజలు ఎంతగా మండిపడుతున్నారో అర్థమవుతున్నది. గతంలో కంటే క్యాన్సర్ ఎన్నోరెట్లు పెరగడానికి మనం తింటున్న ఈ కల్తీ ఆహారమే ప్రధాన కారణమంటే ముచ్చెమటలు పడుతున్నాయి. ‘కల్తీ చేయడం అంటే మన దేశ భావి పౌరులపై కుట్ర చేయడం లాంటిదే’ అని ఓ పౌరుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సర్వేలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు ఎన్నారైలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏప్రిల్ 6 నుండి 14 వరకు సేకరించిన స్పందనలు ఆహార కల్తీపై సమాజంలో ఉన్న ఆగ్రహాన్ని, ఆందోళనను స్పష్టంగా చాటిచెప్పాయి.
సర్కారుదే బాధ్యత
సర్వేలో పాల్గొన్న వారిలో 90% మంది తాము నిత్యం వాడే నిత్యావసరాలు కల్తీ అవుతున్నాయని బలంగా నమ్ముతున్నారు. ‘కేజీ ఎండు మిర్చి ధర కంటే కారం పొడి ధర తక్కువగా ఎలా ఉంటుంది?’ అని ఒక వినియోగదారుడు అడిగిన ప్రశ్న మన వ్యవస్థలోని అసలు రంగును బయటపెట్టింది. మార్కెట్లో పల్లీల ధర కంటే తక్కువకు పల్లీ నూనె దొరుకుతున్నదంటేనే.. మనం తింటున్నది ఆయిలా? లేక స్లో పాయిజనా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. కల్తీ జరుగుతోందని తెలిసినా ఎవరికి ఫిర్యాదు చేయాలో తమకు తెలియదని 60% మంది పేర్కొనడం గమనార్హం. అధికారులు కేవలం ఘటనలు జరిగినప్పుడు మాత్రమే ‘హడావిడి’ చేస్తారని, ఆ తర్వాత మామూళ్ల మత్తులో మౌనంగా ఉండిపోతారని సర్వేలో పాల్గొన్న బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 80% మంది ఈ కల్తీ మహమ్మారికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని తేల్చి చెప్పారు. కల్తీని అరికట్టేందుకు ఇప్పుడున్న నిఘా వ్యవస్థ సరిపోదని, ప్రభుత్వమే ప్రత్యేకంగా హైడ్రాలాంటి ఓ ‘స్పెషల్ యాక్షన్ టీమ్’ను ఏర్పాటు చేయాలని అత్యధిక మంది కోరుతున్నారు. కల్తీకి పాల్పడే వారికి కేవలం ఫైన్లు వేసి వదిలేయకుండా.. వారిని ‘హంతకులు’గా పరిగణించి ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు విధించాలని 70% మంది డిమాండ్ చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. శిక్షలు ఎలా ఉండాలని అడిగిన ప్రశ్నకు భారీ జరిమానా, లైసెన్స్ రద్దు, దుకాణం సీజ్, జీవిత ఖైదు అన్నీ కలిపి అమలు చేయాలని సర్వేలో పాల్గొన్నవారిలో అత్యధికులు పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా ఉన్నదని సర్వేలో పాల్గొన్న అత్యధికమంది పేర్కొన్నారు. ప్రభుత్వం వైఫల్యంతోపాటు అధికారుల అలసత్వం కూడా స్పష్టంగా ఉన్నదని చెప్పారు.
సర్వే వెల్లడైన అభిప్రాయాలు
- రోజూ వినియోగించే పాలు, నూనె, కారం, పప్పుల్లో కల్తీ జరుగుతున్నదని బలంగా నమ్ముతున్నారు. (90%)
- కల్తీ ఆహారం వల్ల తమ కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలయ్యారు. (60%)
- కల్తీ జరిగినట్లు తెలిస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో కనీస అవగాహన లేదు. (45%)
- ‘ప్రభుత్వ వైఫల్యం’, అధికారుల మామూళ్ల వల్లే కల్తీ జరుగుతున్నది. (80%)
ప్రజల అభిప్రాయాలు ఇలా..
- లంచాలు తీసుకుని కళ్లు మూసుకునే అధికారులే కల్తీకి అసలు కారణం. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ నుంచి మంత్రి వరకు మామూళ్లు వెళ్లిపోతున్నాయి
- కల్తీ వ్యాపారులకు రాజకీయ నాయకుల అండ ఉంది. అధికార పార్టీ సంబంధాలు లేకుంటే ఇంత నిర్భయంగా కల్తీ చేయడం అసాధ్యం.
- జిల్లాకు కనీసం పది మంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ఉంటే కల్తీ నివారించవచ్చు.
- నాకెందుకులే అనే ఆలోచన మారాలి. కల్తీ జరిగిందని తెలిస్తే భయపడకుండా ఫిర్యాదు చేయాలి.
- పాత పద్ధతుల్లో వ్యవసాయం, ఇంట్లో ఆహారం తయారు చేసుకోవాలి. రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి.






