- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెడికల్ కాలేజీల్లో శవాల కొరత
సమాజంలో వైద్య విద్యకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మొదటినుండి వైద్యరంగంపై ప్రజల్లో ఎన్నో అంచనాలు ఏర్పడి ఉన్నాయి.

దిశ తెలంగాణ బ్యూరో: సమాజంలో వైద్య విద్యకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మొదటినుండి వైద్యరంగంపై ప్రజల్లో ఎన్నో అంచనాలు ఏర్పడి ఉన్నాయి. దానికి తగ్గట్టుగా కరోనా లాంటి విపత్తు సమయాల్లో వైద్యుల సేవలు కూడా మరువలేనివి.. అలాంటి వైద్యరంగం ఇప్పుడు ఒక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అది పోవాలంటే సమాజంలో పూర్తిస్థాయి చైతన్యం రావడం ఒక్కటే పరిష్కారం..
ఇంతకీ ఆ సమస్య ఏంటంటే..
వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ మొదటి సంవత్సరంలో అనాటమీ అంటే శరీర నిర్మాణ శాస్త్రానికి సంబంధించిన సబ్జెక్టు చాలా కీలకమైనది. మానవ శరీరం ఏ రకంగా నిర్మాణమైందో, అందులోని కండరాలు, ఎముకలు, నరాలు, దేహ వ్యవస్థలు ఏ రకంగా ఎక్కడెక్కడ అమరి ఉన్నాయో కూలంకషంగా వివరించే సబ్జెక్టు ఇది. క్రీస్తు పూర్వం నుండి అనాటమీ సబ్జెక్టుకి డెడ్ బాడీలను డిసెక్షన్ చేయడం ద్వారా ప్రాక్టికల్ గా నేర్చుకునేలా డిజైన్ చేయబడి ఉంది. ఇప్పటికీ ఈ సబ్జెక్టు విషయంలో కడైవర్.. అంటే మరణించిన వారి మృతదేహం అవసరం.. కానీ ఇవే ఇప్పుడు ప్రైవేటు కాలేజీల్లో అందుబాటులోకి రాక మెడికోలు కీలకమైన సబ్జెక్టులో పూర్తిస్థాయిలో రాణించలేకపోతున్నారు..
నేషనల్ మెడికల్ కమిషన్ ఏం చెబుతోందంటే?
వైద్య విద్య పై విధివిధానాలను రూపొందించి నేషనల్ మెడికల్ కమిషన్ ప్రతి మెడికల్ కాలేజీకి ఖచ్చితమైన నిబంధనలను విధించింది. కనీసం 10- 15 మంది విద్యార్థులకి ఒక డెడ్ బాడీని తప్పనిసరిగా యజమాన్యాలు అరేంజ్ చేయాలని,చదువుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని కండిషన్ విధించింది. దీని ప్రకారం చూస్తే తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి గమనిస్తే కనీసం 30% కూడా డెడ్ బాడీలు అందుబాటులో లేవని తెలుస్తోంది.. దీంతో కమిషన్ ఉత్తర్వులు కాగితాలకే పరిమితమయ్యాయి. కొన్ని ప్రైవేటు కళాశాలలు స్థానికంగా ఉండే ఎన్జీవోలతో అవగాహనకు వచ్చి శరీర దానానికి సిద్ధపడ్డ వారి నుండి డెడ్ బాడీలను పొందగలుగుతున్నాయి. కానీ అన్ని సమయాల్లోనూ ఇది సాధ్యం కావడం లేదు. దీంతో డమ్మీ డెడ్ బాడీ లు గా పిలవబడే అనాటమి మోడల్స్ ని వాడుతున్నారు.
ఎందుకిలా జరుగుతోంది?
సమాజంలో ఉన్న సాంస్కృతిక మత విశ్వాసాలే ప్రధాన కారణం. వైద్యరంగం ద్వారా లబ్ధి పొందాలనుకునే ప్రతి వర్గమూ కూడా శరీర దానం విషయానికి వచ్చేసరికి వెనకడుగు వేస్తోంది. అయితే గతంతో పోలిస్తే పరిస్థితులు చాలావరకు మారినప్పటికీ జనాభాకు తగ్గట్టుగా పెరిగిన మెడికల్ కాలేజీల విషయంలో మృతదేహాల కొరత కాలేజీలను వేధిస్తోంది.
ప్రభుత్వం ఏం చేయాలి?
పెరిగిన కాలేజీలకు తగ్గట్టుగా ప్రైవేటు కళాశాలలు ప్రభుత్వ వైద్య కళాశాలలైన గాంధీ, ఉస్మానియాలనుండి ఇలాంటి డెడ్ బాడీలను తీసుకునే అవకాశం ఉంది. వీటిని మరింత సరళతరం చేయాల్సిన అవసరం ప్రభుత్వం వైపు ఉంది. ఇక కఠిన నిబంధనలను బూచిగా చూపిస్తూ కొందరు అధికారులు డెడ్ బాడీలను సైతం పక్కదారి పట్టిస్తున్నారనే అపవాదు వస్తోంది. ఆరోపణలు వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం వల్ల మొదట్లోనే ఇలాంటి వ్యవహారాలకు చెక్ పెట్టొచ్చు. ఇక ప్రజల్లో అవగాహన పెంచడానికి పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. శరీర దానం వలన వైద్యరంగంలో నిష్ణాతులైన లో తయారవుతారని ఎన్జీవోల ద్వారా ప్రజల్లో ప్రచారం చేయాల్సి ఉంటుంది. దీంతో సమాజంలో కొంతైనా మార్పు వచ్చే అవకాశం ఉంది.
నిబంధనలు మార్చడం వల్ల కలిగే ఉపయోగాలు.
మొదటగా ప్రధానంగా వైద్య కళాశాలలను పట్టిపీడిస్తున్న మృతదేహాల కొరతను అధిగమించవచ్చు. వైద్య విద్యార్థులు కీలకమైన మొదటి సంవత్సరంలోనే శరీర నిర్మాణ శాస్త్రం పై పూర్తిస్థాయి పట్టు సాధించగలుగుతారు.రెండవది ప్రమాదాల కారణంగా లేదా గుర్తించబడని వ్యక్తుల మృతదేహాలను రిజర్వ్ చేయడం గాంధీ,ఉస్మానియా లాంటి ఆసుపత్రి మార్చురీలకు మాత్రమే కాదు జిల్లా స్థాయిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు సైతం పెద్ద తలనొప్పిగా మారింది. రోజుల తరబడి అందులో ఉంచడం కారణంగా డీకంపోస్ కి గురై ఆసుపత్రి సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ సమస్య కూడా తొలగిపోతుంది.
చివరగా వైద్యరంగం నుండి ఆశించడం ఒకటే కాదు... సమాజం నుండి స్పందన వస్తేనే కలిసికట్టుగా భవిష్యత్తు వైద్య నిపుణులను తయారు చేసుకోగలమనే మూకుమ్మడి ఆలోచన ప్రజల్లో తలెత్తుతుంది. ఇలాంటి ఆరోగ్యకరమైన భావనలు సమాజానికి చాలా మంచిది. రానున్న రోజుల్లోనైనా ఇది సాధ్యమవాలని ఆశిద్దాం. దీనికి ప్రతి ఒక్కరూ శరీరధానాన్ని ప్రోత్సహిద్దాం.
ఫణిరాజ్. కె






