- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లెగసీ వ్యర్థాల తొలగింపునకు ‘బియాండ్ రొటీన్ - ఎక్స్‌ట్రా అవర్ సర్వీస్’
నగరంలోని లెగసీ వ్యర్థాలు, నిర్లక్ష్యంగా పేరుకుపోయిన చెత్తను వేగవంతంగా తొలగించేందుకు సీఎంసీ, హెచ్ఐఎంఎస్ డబ్ల్యూ సహకారంతో ‘బియాండ్ రొటీన్ – ఎక్స్‌ట్రా అవర్ సర్వీస్’ పేరుతో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలోని లెగసీ వ్యర్థాలు, నిర్లక్ష్యంగా పేరుకుపోయిన చెత్తను వేగవంతంగా తొలగించేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్‌డబ్ల్యూ లిమిటెడ్ (హెచ్ఐఎంఎస్ డబ్ల్యూ) సహకారంతో ‘బియాండ్ రొటీన్ – ఎక్స్‌ట్రా అవర్ సర్వీస్’ పేరుతో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని సీఎంసీ అదనపు కమిషనర్ (పారిశుధ్యం) వేణుగోపాల్ రెడ్డి టిప్పర్ వాహనాలు, లోడింగ్ యంత్రాలను జెండా ఊపి ప్రారంభించారు. నిత్య పారిశుధ్య కార్యక్రమాలకు అదనంగా ప్రత్యేక సిబ్బంది, యంత్రాలను వినియోగించి, చాలా కాలంగా పేరుకుపోయిన లెగసీ వ్యర్థాలు, నిర్లక్ష్యంగా ఉన్న చెత్త కుప్పలు, రహదారుల పక్కన, ఖాళీ స్థలాల్లో పడేసిన వ్యర్థాలను తొలగించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
మొదటి దశలో కూకట్‌పల్లి జోన్ పరిధిలోని శ్రీలా పార్క్ ప్రైడ్ రోడ్ వద్ద లెగసీ వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. గుర్తించిన లెగసీ వ్యర్థాల ప్రాంతాలను పూర్తిగా తొలగించేందుకు ఈ కార్యక్రమాన్ని దశలవారీగా అన్ని జోన్‌లకు విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ (పారిశుధ్యం) వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, రహదారుల పక్కన, ఖాళీ స్థలాల్లో చెత్త వేయకుండా ప్రజలు, వాణిజ్య సంస్థలు, వీధి వ్యాపారులు సహకరించాలని కోరారు. ఇంటి వద్దే వ్యర్థాలను తడి–పొడి వ్యర్థాలుగా వేరు చేసి, అధీకృత ఇంటింటి చెత్త సేకరణ వాహనాలకే అందించాలని విజ్ఞప్తి చేశారు. అక్రమంగా చెత్త పారబోయడాన్ని అరికట్టేందుకు నిఘాను మరింత బలోపేతం చేయడంతో పాటు ‘నో బిన్ – నో ట్రేడ్’ విధానాన్ని కఠినంగా అమలు చేస్తామని తెలిపారు. వాణిజ్య సంస్థలు తప్పనిసరిగా చెత్త బుట్టలు ఏర్పాటు చేసి, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణను పాటించాలని సూచించారు. ‘పరిశుభ్రమైన సైబరాబాద్ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి పౌరుడు, ప్రతి వాణిజ్య సంస్థ వ్యర్థాలను మూలంలోనే వేరు చేసి అధీకృత వాహనాలకే అందించాలి. లెగసీ వ్యర్థాల తొలగింపుతో పాటు అక్రమంగా చెత్త పారబోయడంపై కూడా కార్పొరేషన్ కఠిన చర్యలు కొనసాగిస్తుంది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పారిశుధ్య సిబ్బంది, హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్‌డబ్ల్యూ లిమిటెడ్ ప్రతినిధులు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.






