Bhatti Vikramarka: ఒడిశాలో సింగరేణి నైనీ బ్లాక్ గనిని ప్రారంభించిన భట్టి విక్రమార్క

by Prasad Jukanti |
Bhatti Vikramarka: ఒడిశాలో సింగరేణి నైనీ బ్లాక్ గనిని ప్రారంభించిన భట్టి విక్రమార్క
X

దిశ, డైనమిక్ బ్యూరో: సింగరేణి చరిత్రలో నైనీ గని ప్రారంభం ఒక సువర్ణాధ్యాయం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (DCM Bhatti Vikramarka) అన్నారు. ఇవాళ అధికారులతో కలిసి ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ ను (Naini Coal Block) భట్టి విక్రమార్క వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒడిశాలో సింగరేణి విస్తరణ తెలంగాణకు గర్వకారణం అన్నారు. ఇది సింగరేణికి మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక ఆనందకర సందర్భం అన్నారు. సింగరేణి విశ్వవ్యాప్త విస్తరణకు నైనీ బ్లాక్ ప్రారంభం తొలి మెట్టు అని, ప్రజాపాలనలోనే నైనీ బొగ్గు బ్లాక్ పై ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజాపాలనలో ఇతర రాష్ట్రాలకు సింగరేణిని విస్తరిస్తామన్నారు. బొగ్గుగని ఏర్పాటుకు సహకరించిన ఒడిశా (odisha) సీఎం మోహన్ చరణ్ మాంఝీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ కు భట్టి ధన్యవాదాలు తెలిపారు.

తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు గని ప్రారంభించిన సింగరేణికి (Singareni) ఈ సందర్భంగా భట్టి అభినందనలు తెలిపారు. గని ఏర్పాటుకు సహకరించిన అంగుల్ జిల్లా ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కృషి చేస్తామని చెపపారు. పెద్ద ఎత్తున సామాజిక బాధ్యత కార్యక్రమాలు చేప‌డ‌తామ‌ని, 16,00మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నహాలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్ కో సీఎండీ శ్రీ కృష్ణ భాస్కర్, ఒడిశా నుంచి పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే అగస్తి బెహరా, సింగరేణి సీఎండీ శ్రీ ఎన్‌.బ‌ల‌రామ్ తదితరులు పాల్గొన్నారు.

కొత్త శకానికి నాంది: సీఎం రేవంత్ రెడ్డి

ఒడిశాలోని అంగుల్ జిల్లాలోని నైనీ గని ప్రారంభించడం ద్వారా సింగరేణి కొత్త శకానికి నాంది పలికిందని ముఖ్యమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు. సింగరేణి సంస్థ చరిత్రలో మొదటిసారి బయటి రాష్ట్రంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభించడం అభినందనీయమన్నారు. నైనీ బ్లాకులో బొగ్గు తవ్వకాలను ప్రారంభించిన నేపథ్యంలో సింగరేణి సంస్థకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. దాదాపు 136 ఏళ్లుగా తవ్వకాలు సాగిస్తూ రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న తెలంగాణ సింగరేణి, రాష్ట్రం బయట ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకులో తవ్వకాలు ప్రారంభించి భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ట్వీట్ చేసింది. సింగరేణి కోసం ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవ వల్లే తొలిసారి దేశంలోని ఇతర రాష్ట్రంలోనూ బొగ్గు గనిని ప్రారంభించడం సాధ్యమైందని, ఇది మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. నైనీ బొగ్గు గనులకు అన్ని అనుమతులు సాధించి అందులో తవ్వకాలు ప్రారంభించిన చారిత్రక ఘట్టం సాకారం కావడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. తెలంగాణకు మణిమకుటంగా, వేలాది కార్మిక కుటుంబాలకు జీవనాధానంగా నిలుస్తున్న సింగరేణి సంస్థ అభివృద్ధికి, విస్తరణకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని అన్నారు.

Next Story

Most Viewed