మున్సిపల్ ఎన్నికల్లో కమీషన్ల పర్వం.. డబ్బులిస్తేనే బీ-ఫామ్!

by Naga Rani Yarlagadda |

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో డీసీసీలు వసూల్ రాజాలుగా మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీ ఫామ్ ఇచ్చేందుకు భారీగా కమీషన్లు పుచ్చుకున్నట్లు తెలుస్తోంది.

మున్సిపల్ ఎన్నికల్లో కమీషన్ల పర్వం.. డబ్బులిస్తేనే బీ-ఫామ్!
X

దిశ,తెలంగాణ బ్యూరో: ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కొందరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అభ్యర్థులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పార్టీ జారీ చేసే బీ ఫామ్ ఇచ్చేందుకు లక్షల్లో వసూళ్లు చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. అడిగినంత మొత్తంలో డబ్బులు ఇచ్చిన తరువాతే బీ–ఫామ్ చేతిలో పెట్టారని, లేకపోతే మరోకరికి బీ ఫామ్ ఇస్తామని బెదిరించినట్లు వాపోతున్నారు. దీనితో తప్పనిసరి పరిస్థితుల్లో డీసీసీ అధ్యక్షులు అడిగినంత డబ్బులు ఇచ్చామని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

మూడు లక్షల రేటు ఫిక్స్

పార్టీ తరుపున పోటీ చేస్తోన్న అభ్యర్థులు పార్టీ జారీ చేసే బీ–ఫామ్ తప్పనిసరిగా ఇవ్వాలి. అప్పుడే సదరు పార్టీ అభ్యర్థిగా ఈసీ ప్రకటిస్తుంది. లేకపోతే నిబంధనల ప్రకారం స్వతంత్ర అభ్యర్థులుగా గుర్తిస్తారు. అయితే మెజార్టీ మంది అభ్యర్థులు చివర రోజున బీ ఫామ్ ను అధికారులకు సమర్పిస్తుంటారు. ఈ డెడ్ లైన్ ను ఆసరాగా చేసుకుని మెజార్టీ జిల్లాల అధ్యక్షులు అభ్యర్థుల నుంచి మామూళ్లను ముక్కుపిండి వసూలు చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఒక్కోక్క అభ్యర్థి నుంచి మూడు లక్షలు ఇవ్వాలని,ఆ సొమ్ము వచ్చిన తరువాతే బీ ఫామ్ ను చేతిలో పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వడంసాధ్యం కాదని చెప్పిన అభ్యర్థులకు అదిగో ఇస్తాం.. ఇదిగో ఇస్తామంటూ సతాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనితో గడువు లోపు బీ ఫామ్ ఇవ్వకపోతే పార్టీ గుర్తింపు రాదని భయంతో సదరు అభ్యర్థులు సైతం అడిగినంత ముట్టుచెప్పినట్లు ప్రచారం జరుగుతున్నది. కొన్ని జిల్లాల్లో డబ్బులు ఇవ్వకపోతే మరోకరికి బీ ఫామ్ ఇస్తామని బెదిరింపులకు దిగినట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణలోని రెండు మూడు మున్సిపల్ కార్పోరేషన్ల పరిధిలో మామూళ్ల పర్వం బహిరంగంగానే జరిగినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. అలాగే దక్షణ తెలంగాణ జిల్లాల్లోని కొందరు అధ్యక్షులు సైతం రెండు లక్షల వరకు రేటు ఫిక్స్ చేసి వసూలు చేసినట్లు చర్చ ఉంది.

ముట్టుచెప్తేనే పదవులు ఇచ్చారట

నిజానికి అభ్యర్థుల ఎన్నికల ఖర్చులో మెజార్టీ మొత్తాన్ని ప్రభుత్వంలోని కీలక నేతలే సమకూర్చినట్లు తెలుస్తున్నది. అయితే ఆ పనులను సమన్వయం చేయాల్సిన బాధ్యతలను మంత్రులకు అప్పగించారు. దీనితో జిల్లా అధ్యక్షుల ప్రమేయం అంతగా లేకుండా పోయింది. అయితే బీ ఫామ్ జారీ అధికారం ఉండటంతో డీసీసీ అధ్యక్షులు తెలివిగా వ్యవహరించి, బీఫామ్ ఇచ్చేందుకు మామూళ్లు తీసుకున్నట్లు తెలుస్తున్నది. కొందరు అభ్యర్థులు డబ్బులు ఎందుకు ఇవ్వాలని అడిగితే‘‘ డీసీసీ అధ్యక్ష పదవి మాకు ఊరికే రాలేదు. పైన డబ్బులు తీసుకునే పోస్టులు ఇచ్చారు. మరి మా ఖర్చులు ఎలా రాబట్టుకోవాలి’’అని ప్రశ్నించినట్లు తెలుస్తున్నది. అయితే కొన్ని జిల్లాల జరిగిన మామూళ్ల పర్వంపై విసిగి పోయిన అభ్యర్థులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా వినివినట్లుగా వ్యవహరించారని ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం ఎన్నికల హడావుడి ముగియడంతో పోటీ చేసి ఓడిపోయిన కొందరు లీడర్లు సమయం,సందర్భం చూసుకుని సీఎం రేవంత్ రెడ్డి,పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ కు ఫిర్యాదు చేయాలని యోచనలో ఉన్నారు.

Next Story