కాలం చెల్లిన మందులు.. బిల్లులు లేకుండానే కొనుగోళ్లు

by Naga Rani Yarlagadda |

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు శనివారం ఉక్కుపాదం మోపారు.

కాలం చెల్లిన మందులు.. బిల్లులు లేకుండానే కొనుగోళ్లు
X
  • కోల్డ్ చైన్ లేకుండానే నిల్వ చేసిన మెడిసిన్
  • రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలను ఉల్లంఘించిన 144 మెడికల్ షాపులు
  • నోటీసులు జారీ చేసిన డ్రగ్ కంట్రోల్ అథారిటీ

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు శనివారం ఉక్కుపాదం మోపారు. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న మందుల విక్రయాల్లో నిబంధనలను బేఖాతరు చేస్తున్న ఫార్మసీల గుట్టు రట్టు చేశారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రత్యేక తనిఖీల్లో భారీ ఎత్తున అక్రమాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా కాలం చెల్లిన (ఎక్స్‌పైరీ) మందులను విక్రయించడం, ఎలాంటి కొనుగోలు, అమ్మకం బిల్లులు లేకుండానే మందుల వ్యాపారం సాగించడం, ఫ్రిజ్‌లలో భద్రపరచాల్సిన కోల్డ్ చైన్ మెడిసిన్‌ను సాధారణ ఉష్ణోగ్రతల్లో నిర్లక్ష్యంగా నిల్వ చేయడం వంటి అనేక ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. ఈ డ్రైవ్‌లో నిబంధనలకు పాతరేసినట్లు తేలిన 144 మెడికల్ షాపులకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 నిబంధనల ప్రకారం వీరిపై తదుపరి కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు

ఈ ప్రత్యేక సోదాల్లో అధికారులు విస్తుపోయే నిజాలను కనుగొన్నారు. అర్హత కలిగిన రిజిస్టర్డ్ ఫార్మాసిస్ట్‌లు లేకుండానే ఇష్టారాజ్యంగా ప్రిస్క్రిప్షన్ మందులను రోగులకు పంపిణీ చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే ప్రాణాంతక, సున్నితమైన ఔషధాల నియంత్రణకు కీలకమైన ప్రిస్క్రిప్షన్ డ్రగ్ రిజిస్టర్లను, షెడ్యూల్ హెచ్1 రిజిస్టర్లను మెడికల్ షాపుల యాజమాన్యాలు అసలు నిర్వహించడం లేదని తేలింది. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే యథేచ్ఛగా మందులు అమ్మడం, షాపుల్లో నిల్వ ఉన్న స్టాక్‌కు సంబంధించిన కొనుగోలు బిల్లులను చూపించలేకపోవడం వంటి ఉల్లంఘనలు సర్వసాధారణంగా మారినట్లు అధికారులు తెలిపారు. అన్నింటికంటే ప్రమాదకరంగా, కాలంచెల్లిన మందులను విక్రయించే స్టాక్‌తో కలిపి ఉంచడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మందుల అక్రమ విక్రయాలు, మాదకద్రవ్యాల (నార్కోటిక్స్) తయారీ వంటి అనుమానాస్పద చర్యలపై ప్రజలు 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు వెల్లడించారు.

Next Story