- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుపాన్ ఎఫెక్ట్.. పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో చలి తీవ్రత స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో చలి తీవ్రత స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. గత కొద్దిరోజులుగా నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త పెరిగినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం మహబూబ్ నగర్, భద్రాచలం, ఖమ్మం జిల్లాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. వారం రోజుల క్రితంతో పోల్చితే కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 5 నుంచి 7 డిగ్రీల మేర పెరిగినట్లు వాతావరణ శాఖ పేర్కొన్నది.
అల్పపీడనం తుఫాన్ వైపు..
దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ అల్పపీడనం మలక్కా జలసంధిపై కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ రానున్న 24 గంటల్లో దక్షిణ అండమాన్ సముద్రంపై వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. అదే పశ్చిమ- వాయువ్య దిశగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ, రానున్న రెండు మూడు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా మరింతగా తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడి అది మరింత బలపడి వాయుగుండంగా మారే ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండం కారణంగా రానున్న రోజుల్లో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.






