మూసీ పునరుజ్జీవనంపై దత్తాత్రేయ, ఈటెల కీలక వ్యాఖ్యలు

by Taduka Kalyani |

కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నది సుందరీకరణ కార్యక్రమం చేపట్టడం మంచి నిర్ణయం అని హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.

మూసీ పునరుజ్జీవనంపై దత్తాత్రేయ, ఈటెల కీలక వ్యాఖ్యలు
X

దిశ, హిమాయత్ నగర్ : కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నది సుందరీకరణ కార్యక్రమం చేపట్టడం మంచి నిర్ణయం అని హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ నగరానికి మూసీ జీవనాడి అని... ప్రకృతి సిద్ధమైన వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. శనివారం హైదరాబాద్ లక్డీకాపూల్ లో ఓ హోటల్ లో తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ ఆధ్వర్యంలో మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న పౌర హక్కుల సంఘం నాయకులు ప్రొఫెసర్ హరగోపాల్ , తెలంగాణ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్, అడ్వొకేట్ పాండురంగారెడ్డి పలువురు పర్యావరణ వేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... మూసీ సుందరీకరణ చేపట్టేకంటే ముందు ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేయాలని సూచించారు. మూసీ లో మురుగు నీరు , పరిశ్రమ వ్యర్థలు నేరుగా చేరకుండా, వాటిని ఎస్టీపీ ద్వారా శుద్ధి చేసిన తర్వాత కలిసేలా చర్యలు చేపట్టాలన్నారు. మూసీ చుట్టూ ఏర్పడిన ఆక్రమణలు తొలగించాలన్నారు. ఈ ఆక్రమణల తొలగింపులో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని ఆయన కోరారు. మొదట నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని సూచించారు. అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఉండాలని , వారి వ్యతిరేకతతో అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అన్నారు. అలాగే ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు , మేధావులు, పర్యావరణ వేత్తలతో ప్రభుత్వం ఓ కమిటీ వేసి , వారి సూచనలను పరిగణలోకి తీసుకోవాలని దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు.

మూసీలో చేపలు పట్టే పరిస్థితి రావాలి

ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళన మూసీ పునరుజ్జీవానికి ఎవరు వ్యతిరేకం కాదని మూసీలో చేపలు పట్టేలా అందులో ఈతలు కొట్టే పరిస్థితులు రావాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. అయితే విద్యార్థులకు ఫీజు రియింబర్స్ మెంట్స్ ఇవ్వడానికే నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం మూసీ పేరుతో లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. మూసీ అనగానే చాలా మంది ప్రభుత్వ భూముల్లో ఇండ్లు కట్టుకున్నారేమో అనుకుంటున్నారని ఇది తప్పు అన్నారు. నదులకు ఎక్కడా బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ల లు ఉండవన్నారు. నదులు ప్రవహిస్తూ ప్రవేట్ భూముల గుండా వెళ్తాయన్నారు. నదికి ప్రభుత్వ భూమి అని చెప్పేందుకు ఎక్కడా ఆధారాలు ఉండవన్నారు. కాకాపోతే నది నాలా అని మాత్రమే మార్క్ చేస్తారన్నారు. అంతే తప్ప నదులను ఆక్రమించుకున్నారని ఆరోపణలు చేయడం సుద్ధ తప్పు అన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ మూసీని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందని, బాధితులకు నష్ట పరిహారం చెల్లించిన తరువాతనే ప్రాజెక్టు మొదలు పెట్టాలన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ బాధితులకు దూరంగా డబుల్ బెడ్ రూమ్స్ కేటాయించడం వల్ల వారికి ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ బాధితులకు అక్కడే ఇండ్లు కట్టించి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. నదిలో పారిశ్రామిక వ్యర్థ్యాలను కలుషితం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story