- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈటల రాజేందర్ వెనుక హరీశ్ రావు.. అసలు గుట్టు విప్పిన రేవంత్ రెడ్డి
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈటల రాజేందర్ అంటే తమకు ఎంతో గౌరవం ఉందని, కానీ కాళేశ్వరం విషయంలో ఆయన అసత్యాలు మాట్లాడి ఆ గౌరవాన్ని కోల్పోతున్నారని సీఎం పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఇచ్చిన సూచనలతోనే ఈటల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుకూలంగా కామెంట్స్ చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఒక బీజేపీ ఎంపీలా కాకుండా, బీఆర్ఎస్ నేతలా ఈటల మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే మేడిగడ్డ లోపాలు తేలాయి..
మేడిగడ్డ బ్యారేజ్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తేలిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ప్రాజెక్టు ప్రారంభించిన కేవలం 11 నెలల్లోనే లోపాలు బయటపడ్డాయని, ఆ సమయంలోనే వాటిని సవరించాలని ఇంజినీర్లు మొత్తుకున్నా.. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. మొదట్లోనే ఆ లోపాలను సరిదిద్ది ఉంటే సమస్య ఇంత పెద్దది అయ్యేది కాదని. నాటి పాలకుల నిర్లక్ష్యం వల్లే నేడు మేడిగడ్డ బ్యారేజ్ కుప్పకూలే పరిస్థితి ఏర్పడిందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
కన్నెపల్లి పంప్ హౌజ్ ఇప్పటికీ కోలుకోలేదు..
2022లో వచ్చిన వరదలకు కన్నెపల్లి పంప్ హౌజ్ పూర్తిగా దెబ్బతిన్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. నాటి నుంచి నేటి వరకు ఆ పంప్ హౌజ్ ఇప్పటికీ పూర్తిగా వినియోగంలోకి రాలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్డీఎస్ఏ (NDSA) ఈ లోపాలపై నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నీటి నిల్వకు ఏమాత్రం అనుకూలం కాదని ఎన్డీఎస్ఏ స్పష్టంగా తేల్చి చెప్పిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రాజెక్టుకు సంబంధించిన ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణాల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఆ సంస్థ పేర్కొందన్నారు. కేవలం ప్రాథమిక రిపోర్టులోనే కాకుండా, ఫైనల్ రిపోర్టులోనూ ఎన్డీఎస్ఏ ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని, అలాంటప్పుడు ఈటల రాజేందర్ బీఆర్ఎస్ తప్పులను వెనకేసుకురావడం వెనుక అంతరార్థం ఏంటనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.






