మూసీ సుందరీకరణకు ముహూర్తం ఫిక్స్: పక్కా ప్లాన్‌తో సర్కార్.. అలైన్‌మెంట్‌లో కీలక మార్పులు

by Gantepaka Srikanth |

హైదరాబాద్ మహానగర గుండెకాయ వంటి మూసీ నది ప్రక్షాళన, పునరుజ్జీవన ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది.

మూసీ సుందరీకరణకు ముహూర్తం ఫిక్స్: పక్కా ప్లాన్‌తో సర్కార్.. అలైన్‌మెంట్‌లో కీలక మార్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగర గుండెకాయ వంటి మూసీ నది ప్రక్షాళన, పునరుజ్జీవన ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. మంగళవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లతో కూడిన మంత్రివర్గ ఉప సంఘం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మూసీ డీపీఆర్ (DPR) వివరాలను అధికారులు మంత్రులకు సమర్పించారు. మూసీ ప్రాజెక్టు తొలి దశ పనుల కోసం దాదాపు రూ.7,055 కోట్లు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ నిధుల సేకరణకు సంబంధించి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB)తో జరిపిన చర్చలు సఫలమయ్యాయని అధికారులు మంత్రులకు వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు అధికారులకు అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా నివాస గృహాలు లేదా ఇతర నిర్మాణాలపై ప్రభావం పడకుండా ప్రాజెక్టు అలైన్‌మెంట్‌లో అవసరమైన మార్పులు చేయాలని సూచించారు. ఎటువంటి నిర్మాణాలకు ఆటంకం కలగని విధంగా ఉన్న ప్రాంతంలో మొదటి 5 కిలోమీటర్ల మేర పనులను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు.

ప్రజలకు ఇబ్బంది వద్దు..

"ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అందరినీ సమన్వయం చేసుకుంటూ మూసీ ప్రాజెక్టు పనులు ముందుకు తీసుకెళ్లాలి" అని మంత్రులు స్పష్టం చేశారు. పనుల నిర్వహణకు సంబంధించి మంత్రులు స్పష్టమైన కాలపరిమితిని విధించారు. వచ్చే ఆగస్టు నెలలో పనులను ప్రారంభించి, 2027 డిసెంబర్ నాటికి తొలి దశను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, వర్షాల వల్ల పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు హితవు పలికారు. సమావేశానికి ముందు మంత్రుల బృందం మూసీ నదిపై ఏర్పాటు చేయబోయే రబ్బర్ డ్యామ్ (Rubber Dam) నమూనాలను ఆసక్తిగా పరిశీలించారు. నదిలో నీటి మట్టాన్ని నియంత్రించడానికి మరియు సుందరీకరణకు ఈ సాంకేతికత ఎలా ఉపయోగపడుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. తొలి దశ పనులు వేగవంతం చేయడం ద్వారా హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Next Story