- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇలాంటి ఎన్నిక నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు: దాసోజు శ్రవణ్
సీఎం రేవంత్‌రెడ్డి చిల్లర సంప్రదాయాలకు తేర తీశారని.. ఇంత గూండాయిజం, రౌడీయిజం ఎప్పుడూ చూడలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డి చిల్లర సంప్రదాయాలకు తేర తీశారని.. ఇంత గూండాయిజం, రౌడీయిజం ఎప్పుడూ చూడలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఇంతటి బీభత్సంగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదన్నారు. ఓటుకు పదివేల దాకా పంచారని.. చీరలు కూడా ఇచ్చారని.. మొత్తంగా రాజ్యాంగాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, బిహార్ ఎన్నికలను తలపించే రీతిలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అక్రమాలు జరిగాయన్నారు. ప్రజలపై రేవంత్ రెడ్డికి విశ్వాసం లేదని.. అందుకే అంతులేని అక్రమాలకు తెరలేపారని అన్నారు. ఎన్నికల కమిషన్ గుడ్డి గుర్రం పండ్లు తోమినట్టు వ్యవహరించిందని.. 20 ఫిర్యాదులు ఇచ్చినా స్పందన లేదని ఆరోపించారు. బోగస్ ఓటింగ్ ఇంతగా ఎప్పూడూ జరగలేదన్నారు. బీఆర్ఎస్ గెలుస్తుందని తెలిసే అక్రమాలకు పాల్పడ్డారని.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు. ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ చైర్మన్ ఎర్రోళ్లపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని ఆరోపించారు. పాతబస్తీ నుంచి ఓటర్లను తెప్పించి ఓట్లు వేయించారని.. ఎంఐఎం ఇందుకు సహకరించిందని ఆరోపించారు. తమ నేత హరీశ్‌రావు సమస్యాత్మక పోలింగ్ బూతుల జాబితా సీఈవోకు ఇచ్చినా చర్యలు లేవన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు దగ్గరుండి దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు.
డ్రోన్లు మోహరించామని ఏం పీకారని ప్రశ్నించారు. సజ్జనార్, శివధర్‌రెడ్డి ఏం చేశారని నిలదీశారు. ఎన్ని దాష్టీకాలు చేసినా ప్రజలు ఓటింగ్‌కు వచ్చారని.. చివరకు ధర్మమే గెలుస్తుందని భావిస్తున్నామని తెలిపారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్నారు. దొంగ ఓట్లకు పోలీసు అధికారులు, ఎన్నికల సిబ్బంది సహకరించారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. మూడు నాలుగు నెలల ముందే రేవంత్‌రెడ్డి అక్రమాలకు తెర తీశారని.. 13 ఏళ్ల అమ్మాయితోనూ కాంగ్రెస్ నేతలు ఓటు వేయించారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని రేవంత్ హత్య చేశారని అన్నారు. తమ నేతల మీద చిన్న శ్రీశైలం దాడులు చేసినా ఆయనపై చర్యలు తీసుకోలేదన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






