కళాకారులు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలు: మంత్రి జూపల్లి

by Taduka Kalyani |   (  Updated:2026-06-16 11:36:37  IST  )

డప్పు, బ్యాండ్ వాయిద్య కళాకారులు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

కళాకారులు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలు: మంత్రి జూపల్లి
X

దిశ, రాంనగర్: డప్పు, బ్యాండ్ వాయిద్య కళాకారులు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ బ్యాండ్, వాయిద్య కళాకారుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. బ్యాండ్ కళాకారులకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి రూ.1,000 కోట్ల నిధి కేటాయించాలని ఈ సదస్సులో డిమాండ్ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో డప్పు, బ్యాండ్ వాయిద్యాలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఉత్సవాలు వంటి ప్రతి కార్యక్రమంలో వీటి ప్రాధాన్యం ఎంతో ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ కళాకారులు కీలక పాత్ర పోషించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా చాలామంది కళాకారులు సరైన గుర్తింపు, ఆదరణ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కళాకారుల డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని, బ్యాండ్ కళాకారులకు పెన్షన్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గుర్తింపు కార్డులు జారీ చేయడం, శిక్షణ కేంద్రాల కోసం స్థలాలు కేటాయించడం వంటి అంశాలపై కూడా చర్యలు చేపడతామని తెలిపారు. కళాకారుల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలపై చర్చించి, ముఖ్యమంత్రితో కూడా మాట్లాడతానని చెప్పారు.

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కళాకారుల డిమాండ్లు న్యాయమైనవేనని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే చెరుపల్లి సీతారామయ్య మాట్లాడుతూ కళాకారులు కోరుతున్న బడ్జెట్ ప్రభుత్వానికి భారమయ్యేంత పెద్దది కాదని, సౌండ్ పొల్యూషన్ కంట్రోల్ కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కళాకారుల సంఘాల నాయకులు మాట్లాడుతూ బ్యాండ్ వాహనాలను సీజ్ చేయరాదని, పోలీసుల వేధింపులు అరికట్టాలని కోరారు. హైదరాబాద్‌లో శిక్షణ కేంద్రాలకు స్థలాలు కేటాయించడం, ప్రతి బ్యాండ్ యూనిట్‌కు రూ.10 లక్షల వడ్డీ రహిత రుణం అందించడం, 50 ఏళ్లు దాటిన కళాకారులకు నెలవారీ పెన్షన్, ప్రమాదాల్లో మృతిచెందిన కళాకారుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్‌పర్సన్ విమలక్క, బ్యాండ్ మరియు వాయిద్య కళాకారులు, సంఘాల ప్రతినిధులు చాంద్ పాషా, అంబాల నారాయణ, భూపతి వెంకటేశ్వర్లు, ఫైల్స్ ఆశయ్య, నేల బాలకృష్ణ, హనుమంతు, సురేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story