కోవిడ్​సమయంలో ప్రభుత్వ వైద్యుల సేవలు మరివలేనివి

by velandi.Saikiran |

ప్రభుత్వ డాక్టర్లు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని, కోవిడ్ వంటి కష్ట సమయంలో వారి సేవలు మరువలేమని దామోదర రాజనరసింహ అభినందించారు.

కోవిడ్​సమయంలో ప్రభుత్వ వైద్యుల సేవలు మరివలేనివి
X

కోవిడ్​సమయంలో ప్రభుత్వ వైద్యుల సేవలు మరివలేనివి

రూ.3వేల కోట్లతో ఉస్మానియా నిర్మాణం చరిత్రలో మైలురాయిగా నిలుస్తోంది : మంత్రి దామోదర రాజనరసింహ

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రభుత్వ డాక్టర్లు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని, కోవిడ్ వంటి కష్ట సమయంలో వారి సేవలు మరువలేమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అభినందించారు. బుదవారం తెలంగాణ వైద్య భవన్​లో ప్రభుత్వం వైద్యులు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హజరై ప్రసంగించారు. ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ డాక్టర్లకు అవసరమైన సేవలను ప్రభుత్వం అందిస్తోంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా మార్చాలని, ఉస్మానియా హాస్పిటల్‌కు నూతన భవనాన్ని నిర్మించాలని దశాబ్దాలుగా డాక్టర్లు అకాంక్షించారు. వారి ఈ దశాబ్దాల ఆకాంక్షను నెరవేరుస్తూ తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా మార్చామని తెలిపారు.

గోషామహల్‌లో 26 ఎకరాల్లో సుమారు రూ.3 వేల కోట్లతో అత్యాధునిక ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం చేపట్టామని, ఇది రాష్ట్ర ఆరోగ్య రంగంలో మరో మైలురాయిగా నిలుస్తుందన్నారు. గత రెండు సంవత్సరాల్లో ఆరోగ్య శాఖలో 10,327 నియామకాలు భర్తీ చేశామని, మరో 6 వేలకు పైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. రెండు రోజుల కితం 174 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులకు నియామక పత్రాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో డాక్టర్లకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని,డీపీహెచ్, టీవీవీపీలో పనిచేస్తున్న స్పెషలిస్టులకు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అవకాశాలు ఇచ్చామన్నారు. జూనియర్ డాక్టర్ల స్టైపెండ్, సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనాలు 15శాతం పెంచినట్లు, బదిలీలు పారదర్శకంగా చేపట్టామని చెప్పారు.

కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్స్ ఇస్తూ డాక్టర్లకు తమకు నచ్చిన పోస్టింగ్ ఎంపిక చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ప్రతి ఒక్కరూ హైదరాబాద్‌లోనే పోస్టింగ్ కావాలంటే ఇవ్వలేమని, ట్రాన్స్‌ఫర్లు, డిప్యుటేషన్లు అంటూ వైద్య సేవలకు ఆటంకం కలిగించవద్దని సూచించారు. హెచ్‌ఆర్, ఇన్‌ఫ్రా, ఎక్విప్‌మెంట్, డ్రగ్స్, డయాగ్నస్టిక్స్ వంటివన్నీ తామ సమకూర్చినా అంతిమంగా వైద్య సేవలు అందించాల్సింది మీరే అన్నారు. జిల్లాల్లో ఉన్న ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు‌ అందించేందుకు అందరం కలిసి కృషి చేద్దామని, డాక్టర్ల నిజమైన డిమాండ్లు అన్నీ తాను సానుకూలంగా పరిష్కరిస్తానని, మీరంతా ప్రజలకు సేవలు అందించడానికి సహకరించాలని కోరారు.

Next Story