ఆన్‌లైన్‌లో ఆస్ట్రాలజీ స్కామ్.. చిక్కారో అంతే సంగతి!

by Naga Rani Yarlagadda |

మీకు ఆర్థిక కష్టాలు ఉన్నాయా.. కుటుంబ కలహాలతో సతమతమవుతున్నారా.. వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా.. వశీకరణ చేయాలా.. ఇంట్లో కూర్చునే మాకు ఫోన్ చేయండి.

ఆన్‌లైన్‌లో ఆస్ట్రాలజీ స్కామ్.. చిక్కారో అంతే సంగతి!
X
  • జాతకాలు, వశీకరణ, పూజల పేరుతో నిలువుదోపిడీ
  • సోషల్ మీడియా ప్రకటనలతో అమాయకులకు వల
  • నమ్మకం కుదిరాక లక్షల్లో వసూళ్లు.. ఆపై బ్లాక్‌మెయిలింగ్, బెదిరింపులు
  • ఆన్‌లైన్ తంత్రాలు, పూజల ప్రకటనలను అస్సలు నమ్మొద్దు
  • సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్

దిశ, తెలంగాణ బ్యూరో: మీకు ఆర్థిక కష్టాలు ఉన్నాయా.. కుటుంబ కలహాలతో సతమతమవుతున్నారా.. వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా.. వశీకరణ చేయాలా.. ఇంట్లో కూర్చునే మాకు ఫోన్ చేయండి.. ప్రత్యేక పూజలతో మీ సమస్యలన్నీ తీర్చేస్తాం.. అంటూ సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు చూసి నమ్మి ఫోన్ చేస్తున్నారా.. అయితే మీరు సైబర్ వలలో చిక్కుకున్నట్లే.. జ్యోతిష్యం నమ్మే అమాయకుల బలహీనతను ఆసరాగా చేసుకున్న సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు ఆన్‌లైన్ జ్యోతిష్యం, తంత్ర సేవల పేరుతో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. జ్యోతిష్య శాస్త్రాన్ని అడ్డుపెట్టుకుని సైబర్ నేరగాళ్లు మాయమాటలు చెప్పి లక్షలాది రూపాయలు కాజేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి మోసాలు బాగా పెరిగిపోతున్నాయి.

జాతకాలు, వశీకరణ, పూజల పేరుతో నిలువునా దోపిడీ

ఈ సైబర్ ముఠాలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో జ్యోతిష్యం పేరుతో ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి, ఆకర్షణీయమైన యాడ్స్ ఇస్తున్నారు. ఎవరైనా తమ సమస్యల పరిష్కారం కోసం ఆ ప్రకటనలు చూసి సంప్రదిస్తే.. నేరగాళ్లు ఎంతో నమ్మకంగా, ఎంపతీతో మాట్లాడుతూ వారి కష్టాలన్నీ వింటున్నట్లు నటిస్తారు. ముందుగా బాధితుల వ్యక్తిగత, కుటుంబ వివరాలన్నీ తెలివిగా లాగుతారు. మీ సమస్యలు కచ్చితంగా పరిష్కరిస్తాం.. ఆన్లైన్లో చిన్న పూజ చేయాలి అంటూ ప్రారంభంలో తక్కువ మొత్తంలో ఫీజు వసూలు చేస్తారు. ఆ తర్వాత, దోషం పెద్దగా ఉందనో, ప్రత్యేక క్రతువులు చేయాలనో చెప్పి విడతల వారీగా అందినకాడికి లక్షల రూపాయలు వసూలు చేస్తారు.

డబ్బులు ఇవ్వకపోతే వివరాలన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పరువు తీస్తాం

అమాయకుల నుంచి పూజల పేరుతో వసూలు చేసిన డబ్బును నేరగాళ్లు నేరుగా తమ ఖాతాల్లోకి కాకుండా, ఎవరికీ అనుమానం రాకుండా ఇతరుల పేర్లతో ఉన్న ఖాతాల్లో జమ చేయించుకుంటూ తమ ప్రమేయం బయటపడకుండా పక్కా ప్లాన్ అమలు చేస్తున్నారు. ఒకవేళ ఏ దశలోనైనా బాధితులు అంత పెద్ద మొత్తం తాము చెల్లించలేమని చెబితే, అప్పుడు ఈ కేటుగాళ్లు తమ అసలు రంగు బయటపెడతారు.డబ్బులు ఇవ్వకపోతే పూజ వికటిస్తుంది, నీ కుటుంబ సభ్యులకు హాని చేస్తాం.. పూజ కోసం నువ్వు పంపిన నీ వ్యక్తిగత ఫొటోలు, కుటుంబ వివరాలన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పరువు తీస్తాం అంటూ భయపెట్టి, మానసికంగా ఒత్తిడికి గురిచేసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెలుగుచూసింది. ఇలా కొద్దిమంది నేరగాళ్లే ఒక ముఠాగా ఏర్పడి వందలాది నకిలీ అకౌంట్లు నిర్వహిస్తూ అమాయకులను టార్గెట్ చేస్తున్నారని పోలీసు అధికారులు గుర్తించారు.

సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ టి.సాయి మనోహర్

ఆన్‌లైన్ ఆస్ట్రాలజీ స్కామ్‌ల నుంచి రక్షణ పొందాలంటే ప్రజలు కొన్ని కనీస జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సోషల్ మీడియాలో జ్యోతిష్యం, తంత్రాలు, సమస్యల పరిష్కారం పేరుతో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని, అలాంటి ప్రకటనల్లో ఇచ్చిన నంబర్లను అస్సలు సంప్రదించవద్దని హెచ్చరించారు. తెలియని, పరిచయం లేని వ్యక్తులకు ఆన్‌లైన్‌లో గుడ్డిగా డబ్బు పంపించవద్దని సూచించారు. పూజలు, దోష నివారణ పేరుతో ఎవరైనా వ్యక్తిగత వివరాలు అడిగితే, మీ ఫొటోలు, కుటుంబ సభ్యుల వివరాలు, చిరునామా వంటి సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు. ఒకవేళ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని, వారు హాని చేస్తామని బెదిరింపులకు దిగితే ఏమాత్రం భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ తరహా మోసాల బారిన పడి ఎవరైనా డబ్బు కోల్పోతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Next Story