- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విచ్చలవిడిగా పెరిగిపోతున్న సైబర్ నేరాలు.. AI సైబర్ ట్రాకర్ ఎక్కడ?
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. దేశంలో ఏఐ ఆధారిత సైబర్ ట్రాకర్ లేకపోవడంతో నానాటికీ కేసుల సంఖ్య పెరుగుతోంది. డీప్ ఫేక్, పెట్టుబడి పెడితే అధిక లాభాల పేరిట, డిజిటల్ అరెస్టుల పేరిట సైబర్ నేరగాళ్లు జనాలను నిండా ముంచుతున్నారు. చదువుకున్న, చదువురాని వారు సైతం సైబర్ మోసాల బారిన చిక్కుకుంటున్నారు. రోజుకు వందల సంఖ్యలో జనాలు సైబర్ బాధితులుగా మిగులుతున్నారు. తీరా సైబర్ మోసానికి గురైన వారు ఫిర్యాదు చేస్తే.. చీటింగ్ కేసుల్లో పెట్టే సెక్షన్లనే సైబర్ నేరాలకూ పెట్టాల్సి రావడంతో మోసగాళ్లకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది. ఈ నేరాల్లో బాధితులకు న్యాయం చేయాల్సిన చట్టాలు అత్యంత తక్కువ తీవ్రతతో ఉన్నాయి. ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) లెక్కల ప్రకారం.. ఒక్క 2024లోనే మనదేశంలో ఆన్‌లైన్ మోసాల ద్వారా రూ. 22 వేల కోట్లకు పైగా డబ్బును నేరగాళ్లు కొట్టేశారు. 36 లక్షల వరకు కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన ప్రతిరోజు సుమారు రూ.60 కోట్ల ప్రజల డబ్బు సైబర్ మోసగాళ్ల జేబుల్లోకి వెళ్తున్నది. ఇంత పెద్ద ఎత్తున ప్రజల సొమ్ము మోసగాళ్ల చేతుల్లోకి వెళ్తున్నా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు మాత్రం అంతంతే ఉన్నాయి.
చట్టాల పరిమితి.. మోసగాళ్లకు వరం
మన దేశంలోని చట్టాలకు ఉన్న పరిమితులే డిజిటల్ మోసగాళ్లకు వరంలా మారుతున్నాయి. ఏదైనా ఒక వ్యక్తి ఫొటో లేదా వీడియోతో డిజిటల్ మోసాలకు పాల్పడే ప్రయత్నం చేస్తే.. బాధితుడే పోలీసులు లేదా సైబర్ సెల్‌కి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అప్పుడే పోలీసులు ఐపీసీ సెక్షన్ 419, 420 కింద కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత సంబంధిత వెబ్‌సైట్ నిర్వాహకులకు ఇది ఫేక్ వీడియో అని దీనిని వెంటనే బ్లాక్ చేయాల్సిందిగా మెయిల్ చేస్తారు. అయితే, ఇలాంటి వీడియోలు అన్నీ విదేశీ సర్వర్ల నుంచి వస్తుండటంతో మన పోలీసులకు జురిస్డిక్షన్ సమస్యలు ఏర్పడుతాయి. అందువల్ల ఈ పోస్టులను తొలగించడం అంత తేలికయ్యే పనికాదు. ఒకవేళ గూగుల్, యూట్యూబ్‌లకు ఫిర్యాదు చేసినా.. ఆ సంస్థలు సదరు అకౌంట్‌ను బ్లాక్ చేస్తారు. అనంతరం సైబర్ నేరగాళ్లు వెంటనే కొత్త అకౌంట్ల నుంచి పోస్ట్ చేస్తున్నారు. ఇటువంటి వాటిని నివారించేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఎన్నో అల్గారిథమ్స్ వాడుతున్నా.. వాటిలోని లోపాలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
ఫిర్యాదు చేయకుంటే..
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేరిట ఒక మిస్ లీడింగ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే.. అది తప్పుడు వీడియో అని ప్రభుత్వ సంస్థలు స్వచ్ఛందంగా ముందుకువచ్చి చర్యలు తీసుకోవు. ఆమె లేదా ఆమె తరఫు మంత్రిత్వ శాఖ బాధ్యులు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అప్పుడు సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.in తక్షణమే స్పందించి.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన CERT.In సంబంధిత ప్లాట్‌ఫామ్‌కి మెయిల్ చేస్తుంది. దీని ఆధారంగా సోషల్ మీడియా సంస్థలు సంబంధిత అకౌంట్‌ను మాత్రమే బ్లాక్ చేస్తాయి. అయితే, ముందుగా బాధితులు తమ పేర్లు లేదా ఫొటోలు, వీడియోలతో ఏయే అకౌంట్లతో పోస్టులు ఎవరు చేశారనే విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడు ఆ అకౌంట్లను ఫిర్యాదులో చేర్చితే వాటిని మాత్రమే తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారు. కానీ, మోసగాళ్లు వందలు, వేల సంఖ్యలో అకౌంట్ల నుంచి పోస్టులు చేస్తుంటారు. మనలో చాలా మంది అది ఫేక్ అని తెలియక రీ పోస్ట్ చేస్తుంటారు. దీంతో అది నివారించలేని సమస్యగా మారుతోంది. పైగా ఈ అకౌంట్లు ఉన్న సర్వర్లన్నీ విదేశాల్లో ఉండటంతో బాధ్యలు ఎవరు అనే విషయాన్ని కూడా అధికారులు పసిగట్టలేరు. వీటిని నివారించాలంటే ప్రస్తుతం మనకున్న చట్టాలు, వ్యవస్థలు మరో 50 ఏళ్లు ఫాస్ట్ ఫార్వార్డ్ బటన్ నొక్కి ముందుకెళ్లాల్సి ఉంటుంది.
ప్రధాని వీడియో డీప్ ఫేక్
రెండు, మూడేళ్ల కిందట ప్రధాని మోడీ ఫొటోను డీప్‌ఫేక్ చేయడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. ఆ వీడియోలు ఎన్ని అకౌంట్ల నుంచి పోస్టు అయ్యాయో చూసి వాటన్నింటినీ తీసేసింది. ఈ విషయంలో హోంమంత్రిత్వ శాఖ, ఐటీ శాఖ స్వయంగా దర్యాప్తునకు ఆదేశించడంతో సంబంధిత సంస్థలన్నీ ఈ విషయంలో విజయం సాధించాయి. కానీ, ఇలాంటి ఘటనలు మనదేశంలో ఇప్పటివరకు ఒకటి రెండుకు మించి ఉండవు.
మన చట్టాలు.. లొసుగులు
- ఏఐ ఆధారంగా వస్తున్న డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలపై మన దేశంలో ఐటీ చట్టం- 2000, ఐటీ రూల్స్ -2021 నిబంధనల ఆధారంగా కేసులు నమోదు చేస్తున్నారు.
- ఎక్కువశాతం చీటింగ్ కేసుగానే పోలీసులు పరిగణించి.. సెక్షన్ 419, 420 కింద కేసులు నమోదు చేస్తారు.
- మనదేశంలో కేంద్ర ప్రభుత్వం సహా చాలా రాష్ట్రాల్లోని సైబర్ సెల్స్‌కి ఏఐ ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్ లేదు.
- ఏదైనా ప్రత్యేక కేసులో పోలీసులు ఏఐ ట్రాకింగ్ వాడినా మోసగాళ్లు డీప్ వెబ్, వీపీఎన్ వాడి తమ గుర్తింపు బయటపడకుండా జాగ్రత్త తీసుకుంటారు.
- దేశంలో వాడే అన్ని యాప్‌లు, వెబ్‌సైట్ల సర్వర్లు మనదేశంలో ఉంటేనే ఈ సమస్యకు చెక్ పెట్టడం సాధ్యం అవుతుంది.
- కానీ, అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం ఇతర దేశాల్లోని కంపెనీలను డిమాండ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం.
- అందువల్లే ఇలాంటి డీప్‌ఫేక్ వీడియోలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.
- శాంతిభద్రతలు, జాతీయ భద్రత అంశాల్లో మాత్రమే మనదేశంలో ప్రభుత్వరంగ సంస్థలు సుమోటోగా యాక్షన్ తీసుకుంటాయి. ఈ మేరకు మాత్రమే ప్రభుత్వ సంస్థలకు అనుమతి ఉన్నది.
- డీప్‌ఫేక్ లేదా సైబర్ క్రైమ్ ఘటనలు శాంతిభద్రతలు, జాతీయ భద్రతల అంశాల్లోకి రానందున ప్రభుత్వ ఏజెన్సీలు చర్యలు తీసుకోలేకపోతున్నాయి.
ఇంటర్-ఏజెన్సీ కోఆర్డినేషన్ లోపం..
సైబర్ మోసాలపై ఇప్పటికీ మనదేశంలో ఏకీకృత వ్యవస్థ లేదు. ఏ సంస్థ అయినా తమ తమ పరిధిలో పనిచేస్తుంది తప్పితే సమన్వయంతో పనిచేసిన సందర్భాలు తక్కువే. సైబర్ మోసాలపై మనదేశంలో ప్రధానంగా పనిచేస్తున్న సంస్థలు CERT-In, MEITY, కేంద్ర హోంశాఖ, రాష్ట్ర పోలీసు విభాగాల పరిధిలోని సైబర్ సెల్స్. ఇవి సమన్వయంతో పనిచేసిన సందర్భాలు చాలా అరుదు. దీనివల్ల సైబర్ విష వలయాన్ని చేధించడం అన్ని విభాగాలకు సమస్యగా మారుతున్నది. పైగా మనదేశంలో ‘ఏఐ ఫ్యాక్ట్ బేస్డ్ చెక్ హబ్’ లేదా ‘రియల్ టైమ్ రెస్పాన్స్ సెల్’ లేవు. ఇప్పటికే ఏళ్లుగా డీప్ ఫేక్ కేసులు వెలుగుచూస్తు్న్నా.. కనీసం దానిని నివారించేందుకు లేదా చర్యలు తీసుకునేందుకు ఎలాంటి చట్ట రూపకల్పన జరగలేదు. దీనివల్ల జరగాల్సిన నష్టం జరిగిపోతున్నది. ఇంటర్నెట్‌లో ఒక వీడియో ఫేక్ అన్న ఫిర్యాదు రాగానే ఎన్ని అకౌంట్లలో ఆ కంటెంట్ ఉన్నా వెంటనే అవన్నీ బ్లాక్ కావాలి. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఏఐ, రియల్ టైమ్ రెస్పాన్స్ సెల్స్ పనిచేస్తున్నాయి. సందేహాస్పద వీడియోలు వైరల్ కాకముందే వాటిపై ఆయా ప్లాట్‌ఫామ్స్‌కి ఫిర్యాదు చేస్తాయి. దీనివల్ల ఎన్ని లక్షల అకౌంట్ల నుంచి పోస్టులు వచ్చినా, నిమిషాల్లో అవన్నీ బ్లాక్ అవుతాయి. మనదేశంలోనూ ఏఐ ఆధారిత ట్రేసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. మండల కేంద్రం నుంచి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే వ్యవస్థల వరకు సమన్వయం ఉండేలా ప్రణాళికలు చేపట్టాలి.
ప్రజలు ఏం చేయాలి?
ఓ జువెల్లరీ షాప్ యాడ్‌లో చెప్పినట్టుగా ‘డబ్బులు ఎవరికీ ఊరికే రావు’ అన్న విషయాన్ని ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. రూ.21 వేలు పెడితే ఎలా రూ.20 లక్షలు వస్తాయనే చిన్న లాజిక్ మరిచిపోవద్దు. కొందరు ఇటువంటి ట్రాప్‌లో చిక్కుకున్నా.. చాలామంది ఇదంతా ఫేక్ అని వదిలేస్తుంటారు. ఇది కూడా తప్పు. బాధ్యతాయుతమైన పౌరుడిగా ఇలాంటి పోస్టులు కనిపించిన వెంటనే ఇది మోసపూరిత కంటెంట్ అని రిపోర్ట్ చేయాలి. అన్ని సోషల్ మీడియాల్లోనూ రిపోర్ట్ బటన్ ఉంటుంది. దీనివల్ల ఆ పోస్టు వెంటనే బ్లాక్ అవుతుంది. అమెరికా, యూరప్ దేశాల్లో తక్కువ మంది నెటిజన్లు ఉన్నా.. ఇలాంటి విషయాలపై సీరియస్‌గా ఉండి వెంటనే కంప్లయింట్ చేస్తారు. కానీ, మనదేశంలో ఎక్కువమంది నెటిజన్లు ఉండి అతి తక్కువ సంఖ్యలో ఫిర్యాదులు చేయడం వల్ల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ కూడా ఇలాంటి మోసాలను నిలువరించలేకపోతున్నాయి. తెలియని వాళ్లు నమ్మి మోసపోతుంటే.. తెలిసిన వాళ్లు ఫిర్యాదు చేయకుండా మరిన్ని మోసాలకు ఆస్కారం కలిగిస్తున్నారు.
సోషల్ ప్లాట్‌ఫామ్స్‌దీ నిర్లక్ష్యమే..
డీప్‌ఫేక్ సహా అనేక మోసపూరిత కంటెంట్‌తో కూడిన పోస్టులను యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ లాంటి సంస్థలు ఎప్పటికప్పుడు “కంటెంట్ మోడరేషన్” పేరుతో తొలగిస్తూనే ఉంటాయి. కానీ, అదే వీడియో వేరే ఖాతాల ద్వారా మళ్లీ వస్తుంటే నియంత్రించలేకపోవడం ఆయా ప్లాట్‌ఫామ్స్ వైఫల్యమే. లక్షలమంది తమ నెటిజన్లు సైబర్ మోసాల బారిన పడుతున్నా.. సంబంధిత సంస్థలు ఈ దిశగా చర్యలు తీసుకోకపోవడం నేరంగానే పరిగణించాలి. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ప్లాట్‌ఫామ్ వారీగా మోసపోయిన నెటిజన్లు, వారు నష్టపోయిన మొత్తాన్ని ఎప్పటికప్పుడు ఆయా సంస్థలకు నోటీసుల రూపంలో జారీచేస్తే ఇకముందు అయినా ప్రజలు, మోసపోయిన బాధితులు అప్రమత్తంగా ఉండే అవకాశం ఉన్నది.






