తెలంగాణ తదుపరి డీజీపీగా CV ఆనంద్? UPSC జాబితాలో ఆ ముగ్గురు అధికారులు!

by Kema Shiva Kumar |

తెలంగాణ పూర్తి కాలపు డీజీపీ నియామకానికి UPSC ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ తదుపరి డీజీపీగా CV ఆనంద్? UPSC జాబితాలో ఆ ముగ్గురు అధికారులు!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రానికి మూడో పూర్తి కాలపు డీజీపీని నియమించే ప్రక్రియ ఎట్టకేలకు తుది దశకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన యూపీఎస్సీ (UPSC), ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడిన తుది జాబితాను ఖరారు చేసింది. అయితే, ఈ రేసులో 1991 బ్యాచ్‌కు చెందిన ప్రస్తుత హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్, 1994 బ్యాచ్‌కు చెందిన ఐబీ స్పెషల్ డైరెక్టర్ (కేంద్ర సర్వీసులు), 1994 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా ఉన్నారు.

సీవీ ఆనంద్‌కే మొగ్గు..

యూపీఎస్సీ పంపే ఈ ముగ్గురి పేర్లలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుత సమీకరణాల ప్రకారం సీవీ ఆనంద్ పేరు దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. ఎంపికైన ముగ్గురిలో ఆనంద్ అందరికంటే సీనియర్. ఏఎస్పీ నుంచి డీజీపీ వరకు రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఆయనకు ఉంది. ఇక వినాయక్ ప్రభాకర్ ఆప్టే ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో కీలక హోదాలో ఉన్నందున, ఆయన రాష్ట్ర క్యాడర్‌కు తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని సమాచారం. ఇక సీవీ ఆనంద్ ఎంపిక లాంఛనమే అయితే, అనురాగ్ శర్మ, మహేందర్ రెడ్డి తర్వాత యూపీఎస్సీ ద్వారా నియమితులవుతున్న మూడో పూర్తి స్థాయి డీజీపీగా ఈయన రికార్డు సృష్టించనున్నారు. అదేవిధంగా ప్రస్తుత ఇన్‌ఛార్జ్ డీజీపీ శివధర్ రెడ్డి ఏప్రిల్ నెలాఖరున రిటైర్ కానున్నారు. ఆయన పదవీ విరమణ తర్వాతే కొత్త డీజీపీ బాధ్యతలు చేపట్టనున్నారు.

Next Story