- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్..? కసరత్తు పూర్తి చేసిన సర్కార్
తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ నియామకం దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నియామకం దాదాపు ఖరారైనట్లు సచివాలయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనుండటంతో వారం రోజుల ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయంలో సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. సీనియారిటీ పరంగా జాబితాలో సీవీ ఆనంద్ ముందు వరుసలో ఉండటంతో పాటు ఆయనకున్న ఇమేజ్ ఈ బాధ్యత అప్పగించడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం వివిధ కీలక బాధ్యతల్లో ఉన్న సీవీ ఆనంద్‌కు క్షేత్రస్థాయిలో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. ముఖ్యంగా శాంతిభద్రతల నిర్వహణలో ఆయనకు ఉన్న పట్టును పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయానికి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. గతంలో హైదరాబాద్ సీపీగా, ఏసీబీ డైరెక్టర్‌గా ఆయన కనబరిచిన పనితీరుపై ప్రభుత్వం సంతృప్తిగా ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర శాంతిభద్రతల బాధ్యతలను ఆయనకు అప్పగించడం ద్వారా శాఖలో మరింత క్రమశిక్షణను పెంచవచ్చని సర్కార్ భావిస్తోంది. రేసులో మరికొందరు అధికారుల పేర్లు వినిపించినప్పటికీ.. సీనియారిటీ, పనితీరు ప్రాతిపదికన ఆయనకే అవకాశం దక్కేలా కనిపిస్తోంది.
పోలీస్ శాఖలో ప్రక్షాళన.. భారీగా బదిలీలు
ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి ఉద్యోగ విరమణకు వారం రోజులే సమయం ఉండటంతో కేవలం డీజీపీ నియామకమే కాకుండా పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళనకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. డీజీపీ నియామకంతో పాటుగా.. కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగం, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు ఎస్పీల బదిలీలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సుమారు 15 నుంచి 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. శాఖలో నూతనోత్తేజం నింపేలా సమర్థులైన అధికారులకు ప్రాధాన్యత ఇస్తూ సీఎం ఒక జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం.
మే 1 నుంచి కొత్త డీజీపీ బాధ్యతలు!
ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డికి ఈ నెలాఖరున ఘనంగా వీడ్కోలు పలికేందుకు పోలీస్ శాఖ ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది. ఆయన ఉద్యోగ విరమణ చేసిన మరుసటి రోజే, అంటే మే 1న కొత్త డీజీపీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. డీజీపీ నియామకంపై యూపీఎస్సీ నిబంధనల ప్రకారం ముగ్గురు పేర్లతో కూడిన ప్యానెల్‌ను పంపడం, అందులో ఒకరిని ఎంపిక చేయడం వంటి అధికారిక లాంఛనాలను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. మరో ఒకటి రెండు రోజుల్లో పోలీస్ బాస్‌తో పాటు, మరికొందరు కీలక అధికారుల నియామకాలపై ప్రభుత్వం నుంచి అధికారిక స్పష్టత రానుంది.






