తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్.. అధికారిక ఉత్తర్వులు జారీ

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-28 12:23:37  IST  )

తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP - హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నియమితులయ్యారు.

తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్.. అధికారిక ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సీవీ ఆనంద్‌ నియామకం అయ్యారు. ప్రస్తుత డీజీపీ శివధర్‌‌రెడ్డి ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనుండటంతో కొత్త పోలీస్ బాస్‌గా సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. సీనియారిటీ పరంగా జాబితాలో సీవీ ఆనంద్ ముందు వరుసలో ఉండటంతో పాటు ఆయనకున్న ఇమేజ్ ఈ బాధ్యత అప్పగించడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శి బాధ్యతల్లో ఉన్న సీవీ ఆనంద్‌కు క్షేత్రస్థాయిలో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. ముఖ్యంగా శాంతిభద్రతల నిర్వహణలో ఆయనకు ఉన్న పట్టును పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయానికి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. గతంలో హైదరాబాద్‌ సీపీగా, ఏసీబీ డైరెక్టర్‌గా ఆయన కనబరిచిన పనితీరుపై ప్రభుత్వం సంతృప్తిగా ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర శాంతిభద్రతల బాధ్యతలను ఆయనకు అప్పగించడం ద్వారా శాఖలో మరింత క్రమశిక్షణను పెంచవచ్చని సర్కార్ భావించి బాధ్యతలు అప్పగించింది.

మే 1 నుంచి కొత్త డీజీపీ బాధ్యతలు..

ప్రస్తుత డీజీపీ శివధర్‌‌రెడ్డికి ఈ నెలాఖరున ఘనంగా వీడ్కోలు పలికేందుకు పోలీస్ శాఖ ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది. ఆయన ఉద్యోగ విరమణ చేసిన మరుసటి రోజే, అంటే మే 1న కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

Next Story