- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జోరుగా సీఎంఆర్ దందా.. అధికారులపై రాజకీయ నేతల ఒత్తిళ్లు?
తాండూరులోని రైస్‌మిల్లర్ల తీరు ‘గుడితోపాటు గుడిలోని లింగాన్నీ మింగేసిన’ చందంగా ఉంది.

దిశ, తాండూరు : తాండూరులోని రైస్‌మిల్లర్ల తీరు ‘గుడితోపాటు గుడిలోని లింగాన్నీ మింగేసిన’ చందంగా ఉంది. ప్రభుత్వానికి అప్పగించాల్సిన కోట్ల రూపాయల బియ్యం బయట మార్కెట్‌లోకి అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. తాండూరులోనే రైస్ మిల్లుల కేంద్రంగా అక్రమ బియ్యం దందా జోరుగా కొనసాగుతున్నది. సర్కారు కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి ఇచ్చేందుకు రైస్ మిల్లర్లకు అప్పగించింది. అయితే మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను మిల్లర్లు ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ, రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి అప్పగిస్తున్నారు. సర్కారు ఎంత కట్టడి చేసినా మిల్లర్లు, వ్యాపారులు రూట్ మార్చి అక్రమ దందాకు తేరలేపుతున్నారు. పలు పార్టీలకు చెందిన కొందరు కీలక నాయకుల హస్తం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సీఎంఆర్ బియ్యాన్ని అధిక శాతం తాండూరులోని పలు మిల్లు, ఇతర ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తున్నది. సమగ్ర విచారణ చేసి బియ్యాన్ని రికవరీ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నామమాత్రంగా కేసులు పెట్టి చేతులు దులుపుకుంటారా..? సమగ్ర విచారణ చేస్తారా..? తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి మరి.
సీఎంఆర్ బియ్యం తాండూరు మార్కెట్లోకి..?
సీఎంఆర్ బియ్యాన్ని అధికారుల కళ్లుగప్పి తాండూరులో ఉన్న పలు రైస్ మిల్లులకు, ఇతర రాష్ట్రాలకు తరలించి కోట్లు గడిస్తుండగా, రేషన్ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి తరలిస్తున్నారు. ఈ అక్రమ దందాను తాండూరులో కొందరు రైసుమిల్లర్లు చేస్తున్నారు. మార్కెట్‌లో, గ్రామాల్లో రేషన్ బియ్యాన్ని పరిస్థితిని బట్టి వ్యాపారులు కిలో రూ.10 నుంచి రూ.12ల చొప్పున మధ్యవర్తులు(ఏజెంట్ల) కొనుగోలు చేస్తున్నారు. రవాణా, బస్తాలు మార్పిడితో రూ.15 నుంచి రూ.18ల వరకు అవుతుంది. ఈ బియ్యాన్ని సీఎంఆర్ పేరిట ఎఫ్‌సీఐకి పంపిస్తున్నారు. ధాన్యం ద్వారా సేకరించిన సీఎంఆర్ బియ్యాన్ని మిల్లర్లు రూ.3400 నుంచి రూ.4000 వరకు ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నారు. ఇలా ప్రభుత్వాన్ని పట్టపగలే కళ్లుగప్పి మోసం చేస్తున్నారు.
అధికారులపై కీలక నేతల ఒత్తిళ్లు..?
భారీ ఎత్తున జరిగిన కుంభకోణంలో అధికారుల వైఖరి విచిత్రంగా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. కిరాణా షాపులో చిన్న ప్యాకెట్ లభిస్తే పట్టుకొని పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి జైలుకు పంపించే.. అధికారులు భారీ కుంభకోణంపై ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో రూ.6.38కోట్ల భారీ ఎత్తున కుంభకోణం జరిగితే.. మీడియాకు తెలియకుండా..? నిందితులపై నామ మాత్రపు కేసులు నమోదు చేసి, రిమాండ్ కు పంపించారనే అనుమానులకు దారి తీసింది. ఈ కుంభకోణంలో కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలకు చెందిన కొందరు కీలక నేతల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అధికార పార్టీ కీలక నేతల ఒత్తిళ్లతో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినా మీడియా సమావేశం ఏర్పాటు చేయకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది.
అసలు వీరి వెనుక ఉన్నదెవరు..?
రైస్‌మిల్లులకు ధాన్యం కేటాయించే విషయంలో సివిల్ సప్లయీస్ అధికారులు మిలాఖత్ అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. 2022-23లో 142 క్వింటాళ్లు, 2023-24లో 17,265 క్వింటాళ్ల వడ్లను పక్కదారి పట్టించి, రూ.6కోట్ల 38 లక్షల 51 వేల బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లోకి తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం మిల్లుల కెపాసిటీని బట్టి ధాన్యాన్ని కేటాయించడంతో పాటు ఎప్పటికప్పుడు మిల్లులపై సివిల్ సప్లయీస్ అధికారులు తనిఖీలు చేస్తేనే ధాన్యం మాయం కాకుండా ఉంటుందని పలువురు అంటున్నారు. వ్యాపారులు ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చి తాండూరులో 80 శాతం, 20 శాతం ఇతర రాష్ట్రాలకు అమ్ముకున్నట్లు తెలిసింది. వ్యాపారులతో సివిల్ సప్లయీస్ అధికారులు.. పలు కీలక నేతలు.. కుమ్మక్కై కెపాసిటీ లేని మిల్లులకు ఎక్కువగా ధాన్యం కేటాయించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సమగ్ర విచారణ చేయాలి
తాండూరులో ఒక రైస్ మిల్లులో రూ.6.38 కోట్ల అవినీతి జరిగింది. ఇంకా తాండూరులో ఉన్న రైస్ మిల్లులతోపాటు జిల్లా వ్యాప్తంగా 40 మిల్లుల్లో ఎంత కుంభకోణం జరిగింది తెలియాలంటే రాష్ట్రస్థాయి అధికారులతో సమగ్ర విచారణ చేయాలి. ఇందులో పలువురు రాజకీయ నాయకులతో పాటు అధికారులు కూడా కుమ్మక్కై ఉన్నారు. లేకుంటే సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాం. - శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు
విచారణ చేస్తాం..
ప్రస్తుతం సంతోష్ కుమార్, చల్లా వెంకటేశ్ పోలీస్ పోలీస్ కస్టీడీలో ఉన్నారు. సీఎంఆర్ బియ్యం కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారు. బ్లాక్ మార్కెట్లో ఎక్కడెక్కడ అమ్మారు..? అనే కోణంలో విచారణ చేపడతాం. - బాలకృష్ణారెడ్డి, తాండూరు డీఎస్పీ






