- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొంథా తుఫాన్ నష్టాలపై సమగ్ర నివేదిక సమర్పించండి: కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు
రాష్ట్రంలో దాదాపు 24 జిల్లాలు ఈ మొంథా తుఫాన్ కు ప్రభావితమయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో దాదాపు 24 జిల్లాలు ఈ మొంథా (Montha) తుఫాన్‌కు ప్రభావితమయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు (CS Ramakrishna Rao) తెలిపారు. జిల్లాలలో జరిగిన పంట నష్టంతో పాటు, రహదారులు, నీటి వనరులు, పశువులు, ప్రాణ నష్టంతో పాటు ఇతర ప్రాథమిక వివరాలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మొంథా తుఫాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ మధ్య కాలంలో ఏ విధమైన సూచనలు లేకుండానే 25 నుంచి 30 సెం.మీ. వర్షపాతం ఆకస్మికంగా కురుస్తోందని, ఈ మేరకు అత్యవసర సమయంలో చేపట్టాల్సిన చర్యలపై జిల్లాల వారీగా ముందస్తు ప్రణాళికలను రూపొందించుకోవాలని సీఎస్ సూచించారు.
తుఫాన్ ప్రభావంతో ఆయా జిల్లాలలో దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ లైన్లు, నీటి వనరులకు తాత్కాలిక పునరుద్ధరణ పనులు ముమ్మరంగా చేపట్టినట్టు అధికారులు పేర్కొన్నారు. ఎక్కడైనా అంగన్వాడీ భవనాలు, పాఠశాల భవనాలు ధ్వంసం అయితే వాటి పునరుద్ధరణకు వెంటనే నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎస్ తెలిపారు. తరచుగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి, శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని, అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. నష్టపరిహారం అందించేందుకు వీలుగా నష్టం వివరాలను సోమవారం వరకు పంపించాల్సిందిగా కోరారు. ఎలాంటి అలసత్యం లేకుండా పునరావాస చర్యలు తీసుకోవాలని కోరారు. విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.






