సరూర్‌నగర్ స్టేడియంలో భారీ బతుకమ్మ వేడుక.. టార్గెట్ గిన్నిస్ రికార్డ్‌

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో ఈనెల 29న నిర్వహించే భారీ బతుకమ్మ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు.

సరూర్‌నగర్ స్టేడియంలో భారీ బతుకమ్మ వేడుక.. టార్గెట్ గిన్నిస్ రికార్డ్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో ఈనెల 29న నిర్వహించే భారీ బతుకమ్మ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. అలాగే.. 26న సీఎంతో బతుకమ్మకుంట ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని.. విజయవంతానికి సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బతుకమ్మ ఉత్సవం గిన్నిస్ బుక్ రికార్డ్‌లో నమోదయ్యే అవకాశం ఉన్నందున ఆ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలన్నారు. అంబర్‌పేట్‌లో ప్రభుత్వం పునరుద్ధరించిన బతుకమ్మకుంటను సీఎం ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలతో హాజరవుతారని చెప్పారు. జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఆహ్వానాలను ప్రజాప్రతినిధులు, వీఐపీలకు సకాలంలో పంపించాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు.

సాయంత్రం 4 గంటల నుండే పెద్ద సంఖ్యలో మహిళలు బతుకమ్మకుంటకు చేరుకునే అవకాశమున్నందున శానిటేషన్, బందోబస్తు, తాగునీటి సదుపాయం తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలని అన్నారు. వీటితోపాటు 27న ట్యాంక్ బండ్‌పై సాయంత్రం బతుకమ్మ కార్నివల్, 29న పీపుల్స్ ప్లాజా, 30న ట్యాంక్ బండ్‌పై పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశామని టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు. ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేయడానికి సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్‌లో రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, ఫైర్ సర్వీసుల డీజీ నాగిరెడ్డి, టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హరిచందన, నారాయణరెడ్డి, సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

Next Story