- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగులకు అంతర్జాతీయ స్థాయి వైద్యం.. ఈహెచ్ఎస్‌పై సీఎస్ కీలక హామీలు
ఉద్యోగులుకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగులుకు మెరుగైన వైద్య సేవలు (medical care) అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు పేర్కొన్నారు. ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఈహెచ్ఎస్) అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు లేవనెత్తిన పలు అంశాలపై స్పందించిన చీఫ్ సెక్రటరీ గారు స్పష్టమైన హామీలు, వివరణలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ నిధిని పర్యవేక్షించే ‘ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్’ ఒక స్వయంప్రతిపత్తి సంస్థగా పనిచేస్తుందన్నారు. ఉద్యోగులు అందించే 1.5 శాతం కాంట్రిబ్యూషన్‌కు సమానంగా ప్రభుత్వ వాటాను కూడా అదే రోజున ట్రస్ట్ ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందని తెలిపారు. ఈ పథకం పర్యవేక్షణ కోసం రాబోయే 2 నుండి 3 రోజుల్లో ప్రత్యేక ఈహెచ్ఎస్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి నిబంధనలు, విధివిధానాలను రాబోయే 7 రోజుల్లో రూపొందించనున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు అంతర్జాతీయ స్థాయి వైద్య సదుపాయాలు అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, వైద్య సేవలు మరింత మెరుగ్గా ఉండాలంటే దానికి తగ్గట్టుగానే కాంట్రిబ్యూషన్ కూడా కొంత అదనంగా ఉంటుందని సీఎస్ పేర్కొన్నారు.
ప్రతి నెల 1వ తేదీన జీతాల రోజే..
ప్రతి నెల 1వ తేదీన (జీతాల రోజే) ఉద్యోగుల వాటాను మినహాయించడం వెనుక మరే ఇతర ఉద్దేశం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఈ హెల్త్ స్కీమ్‌ను అత్యంత వేగంగా, సమర్థవంతంగా అమలు చేయాలన్నదే ప్రభుత్వ ఏకైక లక్ష్యమని చెప్పారు. సమావేశానికి కార్మిక, ఉపాధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిషోర్, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సాధారణ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బీఎండీ ఎక్కా, వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి క్రిస్టినా జెడ్. చోంగ్తూ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి లోకేష్ కుమార్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితా రాణా, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి విజయేంద్ర బోయి, విద్యాశాఖ డిప్యూటీ సెక్రటరీ ఎన్. నికోలస్ హాజరయ్యారు.
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లేవనెత్తిన అంశాలు..
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తరపున తమ అభిప్రాయాలను, సూచనలను ప్రభుత్వానికి వివరించారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అనేక అంశాలను లేవనెత్తారు. ‘భార్య భర్తలు ప్రభుత్వ ఉద్యోగులు అయిన సందర్భంలో ఒక్కరి నుండే సబ్ స్క్రిప్షన్ మినహాయించాలి. పోలీస్ శాఖలో, ఆబ్కారీ శాఖలో వేరు వేరు పేర్లతో ఇప్పటికే ఆరోగ్య పథకాలు అమలు అవుతున్నాయి. ప్రస్తుతం ఈహెచ్ఎస్ లో కూడా మినహాయిస్తారా?. అయూష్ ఆసుపత్రులలో కూడా వైద్యం పొందేందుకు అనుమతించాలి. కుటుంబ సభ్యులను పరిగణించే సందర్భంలో సోదరి, సోదరులను కూడా అనుమతించాలి. భార్య భర్తలలో ఒకరు ఉద్యోగి మరొకరు పెన్షనర్ అయినప్పుడు ఎవరి నుంచి ప్రీమియం తీసుకుంటారు? సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ చేసుకోవడానికి అనుమతించాలి. అవివాహితులైన సంతానానికి 25 సంవత్సరాలు దాటినప్పటికీ వారిని కూడా పథకంలో ఉంచాలి. హెల్త్ ట్రస్ట్ లో సభ్యుల సంఖ్యను పెంచుతారా? ఇతర రాష్ట్రాల ఆసుపత్రులలో చికిత్సకు అనుమతిస్తారా ? సర్వీస్ పెన్షనర్ , ఫామిలీ పెన్షనర్ లు ఒక్కరే ఉన్న సందర్భాల్లో ప్రీమియం ఎలా మినహాయిస్తారు. పథకాన్ని ఏప్రిల్ మాసం నుండి అమలు చేస్తారా? ప్రీమియం మినహాయించి సందర్భంలో పే బిల్స్ లో ఉద్యోగుల, ప్రభుత్వ వాటా కాలం ఉండాలి. ప్రతి నెల మినహాయించబడ్డ ప్రీమియం వెంటనే ట్రస్ట్ బ్యాంకు ఖాతాలో జమ కావాలి. చికిత్సకు అయ్యే విషయంలో అప్పర్ లిమిట్ ఉందా ? ప్యాకేజీల వివరాలు ఏమిటి ? సీపీఎస్ ఉద్యోగుల విషయంలో రిటైర్ అయిన సందర్భంలో ప్రీమియం మినహాయించడానికి లాస్ట్ బేసిక్ పే మీద ఎలా లెక్కిస్తారు. అత్యవసర సమయంలో ఏ హాస్పిటల్ లో నైనా చేరేందుకు అనుమతించాలి. కంటింజెన్సీ ఉద్యోగుల విషయంలో ఈహెచ్ఎల్ ఎలా అమలు చేస్తారు. ప్రభుత్వ ఉత్తర్వులు నెం. 174,171, 91,186, 97, 98 లను పునర్నిర్వచించాలి. ఈహెచ్ఎస్ పథకంలో మే మాస వేతనంలో భార్యాభర్తల ఇద్దరి జీతాల నుంచి ప్రీమియం మినహాయించినందున వాటిని తిరిగి రెమిట్ చేస్తారా?’ వంటి సందేహాలను వారు వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి టీఎన్జీవో అధ్యక్షుడు మారమ్ జగదీశ్వర్, టీజీఓ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్ రావు, టీజీ సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పీఆర్టీయూ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, ఎస్టీయూ అధ్యక్షుడు సదానంద్ గౌడ్, ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి, టి క్లాస్-4 ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు దాస్యా నాయక్, టీఎస్ యూటీఎప్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, టీఆర్టీఎఫ్ అధ్యక్షుడు కటకం రమేష్ హాజరయ్యారు.






