- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
T Congress: వాళ్లు ఫేక్ ప్రచారం చేస్తుంటే మీరేం చేస్తున్నారు? టీ కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ పై సొంత పార్టీలో విమర్శలు
టీ కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ పై సొంత పార్టీలో విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కంచగచ్చిబౌలి భూముల (Kancha Gachibowli Lands) వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్నది. హెచ్ సీయూ సమీపంలోని ఉన్న ఈ 400 ఎకరాల భూ వివాదం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ భూమిని టీజీఐఐసీకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం వివాదానికి దారి తీసింది. ఈ భూముల విషయంలో హెచ్ సీయూ విద్యార్థులు ఆందోళనలకు ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించడంతో సీన్ మొత్తం మారిపోయింది. ఈ క్రమంలో హెచ్ సీయూలో పెద్ద ఎత్తున పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం పరిస్థితిని మరింత పీక్స్ కు చేర్చాయి. రేవంత్ రెడ్డి సర్కార్ పంపిన బుల్డోజర్ల కారణంగా వన్యప్రాణులు చనిపోయాయని, జనావాసాల్లోకి వస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు రోజుకో రకమైన వీడియోలు, ఫోటోలతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంటే ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) సోషల్ మీడియా విఫలం అయిందనే చర్చ సొంతపార్టీలోనే వ్యక్తం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
తప్పుడు ప్రచారం చేస్తుంటే ఏం చేస్తున్నారు?
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వ చర్యలతో నెమళ్లు పారిపోతున్నాయని, ఓ జింక చనిపోయిందంటూ కొన్ని ఫోటోలను విద్యార్థులు, జర్నలిస్టులు, బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు. అవన్నీ సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. వైరల్ అవుతున్న ఫోటోలు అసలైనవి కావని అవన్ని గ్రాఫిక్స్, ఏఐ ద్వారా సృష్టించిన నకిలీవని ఫ్యాక్ట్ చెక్ లో ప్రభుత్వం తేల్చింది. అయితే అప్పటికే వాటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందనే వాదన కాంగ్రెస్ లో వ్యక్తం అవుతున్నది. ప్రతిపక్షాలు ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుంటే వాటిని తిప్పికొట్టాల్సిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ (Social Media Wing) ఏం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నిస్తున్నారు. ఈ ఇష్యుపై పలువురు కాంగ్రెస్ మద్దతు దారులు స్పందిస్తూ.. పార్టీలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుందని పార్టీ సోషల్ మీడియా వారియర్స్ కు సరైన సూచనలు ఇచ్చేవారు కూడా దిక్కులేకుండా పోయారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆయన్ను పక్కన పెట్టండి:
గత జనవరిలో టీ కాంగ్రెస్ సొంత ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ నుంచి పెట్టిన ఓ సర్వే వివాదాస్పదం అయింది. ఫామ్ హౌస్ పాలన కావాలా? లేక ప్రజాపాలన కావాలా? అంటూ కాంగ్రెస్ చేసిన సర్వేలో బీఆర్ఎస్ కు (BRS) మెజార్టీ నెటిజన్లు మద్దతు రావడం కాంగ్రెస్ క్యాడర్ తో పాటు మామూలు జనాలను ఆశ్చర్యపరిచింది. ఈ ఎఫెక్టు ద్వారా నైనా సోషల్ మీడియా మేనేజ్ చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ పాఠాలు నేర్చుకుంటుందని అంతా భావించినా క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీరు అందుకు పూర్తిగా భిన్నంగా ఉందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజా పరిణామాలతో టీపీసీసీ సోషల్ మీడియా వింగ్ ను ప్రక్షాళన చేయాలనే డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీశ్ ను తొలగించి మరోవ్యక్తికి అవకాశం ఇవ్వాలని పార్టీ మద్దతు దారులో బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు స్పందిస్తూ తాము ప్రతిరోజు కష్టపడి ప్రత్యర్థులకు కౌంటర్లు ఇస్తున్నా తమను గుర్తించే దిక్కులేదని, అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియా వారియర్స్ తో కనీసం అవగాహన సదస్సులు నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు స్పందిస్తూ బీఆర్ఎస్ సోషల్ మీడియాపై పెద్ద ఎత్తున ఫోకస్ చెసిందని ఆ పార్టీ సోషల్ మీడియాకు చెందిన దాదాపు 30 వరకు ఆఫీసులు హైదరాబాద్ లోనే ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి గాంధీ భవన్ లో ఓ కంటితుడుప చర్య మాదిరి ఓ చిన్న ఆఫీస్ మాత్రమే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోనున్నది అనేది రాజకీయ వర్గాల్లో డిస్కషన్ గా మారింది.






