CV Anand: ఇదిగో నా పనితీరు.. హైదరాబాద్ సిటీ సీపీగా తన పని తీరుపై సీవీ ఆనంద్ ఆసక్తికర ట్వీట్

by Prasad Jukanti |

సిటీ సీపీగా రెండో సారి బాధ్యతలు స్వీకరించాక నగరంలో క్రైమ్ పరిస్థితిపై సీవీ ఆనంద్ కీలక పోస్టుచేశారు.

CV Anand: ఇదిగో నా పనితీరు.. హైదరాబాద్ సిటీ సీపీగా తన పని తీరుపై సీవీ ఆనంద్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, ఐపీఎస్‍లను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్ సిటీ సీపీగా (Hyderabad City CP) పని చేసిన సీవీ ఆనంద్‍ను (CV Anand) హోంశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. సిటీ సీపీగా వి.సి. సజ్జనార్‍కు (V.C. Sajjanar) బాధ్యతలు అప్పగించింది. అయితే సిటీ సీపీగా తన అనుభవాలను సీవీ ఆనంద్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. నగర సీపీగా రెండోసారి సీవీ ఆనంద్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సెప్టెంబర్ 2024 నుండి ఆగస్టు 2025 వరకు ఈ 12 నెలంలో భారీగా నేరాలు తగ్గినట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పనితీరును క్రైమ్ వింగ్ సమీక్షలో తేలింది. ఈ విషయాన్ని సీవీ ఆనంద్ తన ఎక్స్ ఖాతా ద్వారా స్వయంగా వెల్లడించారు. మొత్తం క్రైమ్ 22 శాతం తగ్గిందని తెలియజేయడానికి సంతోషంగా ఉందని ఎక్స్ లో పేర్కొన్నారు.

దేశంలోనే అత్యుత్తమం:

నేరస్థులను గుర్తించడంతో పాటు అరెస్టులు చేయడం, నాన్ బెయిలబుల్ వారెంట్స్ అమలు చేశామని, కోర్టుల్లో తీర్పులు తీసుకురావడం, రౌడీ గ్యాంగ్స్‌పై నియంత్రణ, మహిళల భద్రత, సైబర్ క్రైమ్ వంటి అన్ని విభాగాలలో పోలీస్ బలగాలు సత్వర స్పందనలతో ఇది సాధ్యమైందని సీవీ ఆనంద్ చెప్పారు. హైదరాబాద్ నగరంలో నైట్ పెట్రోలింగ్ దేశంలోనే అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు.. హైదరబాద్ సిటీ పోలీస్ 2.0 పునర్వ్యవస్థీకరణ అనంతరం ప్రస్తుతం 134 పెట్రోలింగ్ కార్లు 222 బ్లూ కోల్ట్స్ విధుల్లో ఉన్నాయని.. వీటి వల్ల రాత్రి నేరాలు గణనీయంగా తగ్గాయన్నారు. అన్ని పండుగలను శాంతియుతంగా, ఎంత సున్నితమైన సందర్భాలు ఉన్నా సాఫీగా నిర్వహించడం, ఈ ఏడాది లా అండ్ ఆర్డర్ పరంగా విజయవంతమైన సంవత్సరంగా చెప్పవచ్చని పేర్కొన్నారు.

క్రైమ్ రివ్యూ (సెప్టెంబర్ 2023–ఆగస్టు 2024 vs సెప్టెంబర్ 2024–ఆగస్టు 2025):

భౌతిక దాడులు: 3,451 → 2,911 (15.6% తగ్గింది)

మహిళలపై నేరాలు: 3,250 → 2,891 (11.6% తగ్గింది)

ఆస్తి నేరాలు: 5,484 → 4,082 (26% తగ్గింది)

రికవరీ రేటు: 54% → 55% (పెరిగింది)

సైబర్ నేరాలు: 4,348 → 3,745 (14% తగ్గింది)

డిటెక్షన్ రేటు: 40% → 42% (పెరిగింది)

Next Story