BRS VS Congress: నిన్నటి వరకు డైలాగ్ వార్.. ఇవాళ క్రెడిట్ వార్.. బనకచర్లపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్

by Prasad Jukanti |

బనకచర్లపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య క్రెడిట్ వార్ నడుస్తోంది.

BRS VS Congress: నిన్నటి వరకు డైలాగ్ వార్.. ఇవాళ క్రెడిట్ వార్.. బనకచర్లపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయం ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన గోదావరి- బనకచర్ల (Banakacharla) ప్రాజెక్టు చుట్టూ తిరుగుతోంది. ఈ ప్రాజెక్టు పాపం అంతా గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్ దేనని కాంగ్రెస్ (Congress) విమర్శలు గుప్పిస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఏపీ ప్రభుత్వం దూకుడుగా వెళ్తోందని గులాబీ పార్టీ విమర్శలు గుప్పించింది. ఇలా బనకచర్ల విషయంలో నిన్నా మొన్నటి వరకు ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్ పీక్స్ కు వెళ్లగా తాజాగా కేంద్రం నిర్ణయంతో ఇప్పుడీ మాటల యుద్ధం కాస్త క్రెడిట్ వార్ గా (Credit War) మారింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కోసం అవసరమైన విధివిధానాలు జారీ చేసేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల మదింపు కమిటీ నిరాకరించింది. ఈ ప్రాజెక్టుకు తొలుత కేంద్ర జల సంఘం అనుమతులు తీసుకోవాలని ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ సమర్పించిన ప్రతిపాదనను కేంద్ర అటవీ పర్యావరణ నిపుణుల కమిటీ వెనక్కి పంపడం కీలక పరిణామంగా మారింది.

వా వల్లే.. కాదు మావల్లే:

బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై స్పందించిన మాజీ మంత్రి హరీశ్ రావు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఇది బీఆర్ఎస్ పార్టీ పోరాట విజయం, తెలంగాణ ప్రజల విజయం అని అభివర్ణించారు. బనకచర్ల పేరిట తెలంగాణ గోదావరి జలాలను అక్రమంగా తరలించుకుపోయే ఏపీ కుట్రలకు ఇది చెంపపెట్టు అని తెలంగాణ నీటి హక్కులకు అన్యాయం చేసే విధంగా రూపొందించిన బనకచర్ల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిలిపివేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నానంటూ ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్టు చేశారు. ఈ నిర్ణయంపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత ఇది తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం అన్నారు. చంద్రబాబుతో చేతులు కలిపి తెలంగాణ జలదోపిడీకి ద్వారాలు తెరిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకనైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పని చేయాలని గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుపై వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ బనకచర్లపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆడినవన్నీ డ్రామాలేనని స్పష్టమైందన్నారు. ఇన్నాళ్లు బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఆరోపించిన ఈ రెండు పార్టీలు తాజాగా కేంద్ర నిర్ణయంతో యూటర్న్ తీసుకున్నాయని విమర్శించారు.

బనకచర్లను ఆపింది కాంగ్రెస్ ప్రభుత్వమే: చామల

బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమతులు నిరాకరించాలన్న కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ నిర్ణయంపై మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరంతర కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. కానీ ఈ విజయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు బీఆర్ఎస్ నేత హరీశ్ రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. వారివి కేవలం రాజకీయ డ్రామాలు మాత్రమేనని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ హక్కులను కాపాడింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు.

నెక్స్ట్ ఏంటి?:

కేంద్రం తాజా నిర్ణయంతో తర్వాతి పరిణామాలు ఆసక్తిగా మారాయి. అయితే గోదావరి -బనకచర్ల అనుసంధా ప్రాజెక్టుపై తెలంగాణ, ఏపీ సీఎంలతో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ నెల 11న ఢిల్లీలో సమావేశానికి వచ్చేందుకు ఉన్న అవకాశాలను తెలపాలంటూ ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసినట్లు తెలిసింది. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అవసరం అయితే ఏపీతో చర్చించేందుకు రెడీ అంటూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటన చేశారు. ఇటువంటి తరులణంలో కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ నిర్ణయం నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

Next Story