వ్యవసాయ రంగంలో మార్పులకు అనుగుణంగా పరపతి సంఘాలు మారాలి

by Ajay Maddhiboyina |

వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సహకారం పరపతి సంఘాలు తమ దృక్పథం మార్చుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు.

వ్యవసాయ రంగంలో మార్పులకు అనుగుణంగా పరపతి సంఘాలు మారాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో : వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సహకారం పరపతి సంఘాలు తమ దృక్పథం మార్చుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు. కేవలం ఒకటి రెండు సేవలకు పరిమితం కాకుండా, రైతులకు సంబంధించి అన్ని సేవల రూపకల్పనలో పాలుపంచుకోని ప్రయోజనకారిగా ఉండాలని పేర్కొన్నారు. మంగళవారం ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ఎన్​సీడీసీ, కోఆపరేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో ఎఫ్​పీఓలతో నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా హజరైయ్యారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో ఉండి సహకార రంగంలో దేశవ్యాప్తంగా రోల్ మోడల్ గా గెలిచిన ముల్కనూరు సహకార పరపతి సంఘ సాధించిన విజయాలను కొనియాడారు. సహకార సంఘ బాధ్యతలు నీతిగా, నిజాయితీగా చేస్తు, సంఘ అభివృద్ధికి పాటుపాడితే ముల్కనూరు లాంటి సహకార సంస్థలు మరిన్ని ఉద్భవించే అవకాశాలు ఉంటాయని చెప్పారు. భారత ప్రభుత్వం ద్వారా 10 వేల రైతు ఉత్పత్తి సంఘాల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తుందని, ఇప్పటికే ఉన్న ప్రాథమిక సహకార పరపతి సంఘాలను రైతు ఉత్పత్తి సంఘలుగా మార్చి, వారికి మరింత ఆర్థికతోడ్పాటు అందించే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసిందన్నారు.

నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సహకారంతో, నిర్లిప్తంగా ఉన్న తెలంగాణ కో ఆపరేటివ్ యూనియన్ ను క్లస్టర్​బేసేడ్​బిజినెస్​ఆర్గనైజేషన్​గా నియమించి దాని ద్వారా రాష్ట్రంలో 311 సహకార పరపతి సంఘాలను ఎఫ్​పిఓ లుగా ఎన్నిక చేయడం జరిగిందన్నారు. వీటిలో ఒక్కొకదానికి 15 లక్షల ఈక్విటీ గ్రాంటు,18 లక్షల మేనేజ్ మెంట్ ఖర్చులతో కలిపి రూ.167.93 కోట్లు మంజూరు చేశామని, మొదటి విడత రూ.9 కోట్లు 85 లక్షల 40 వేల రూపాయలు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాక కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ లో భాగంగా ప్రతి ఎఫ్ పీఓలకు రూ. 2 కోట్లు వరకు లోన్ గ్యారంటీ సౌకర్యం కూడా ఉందన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలన్ని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అన్నిరకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్దంగా ఉందని వాటిని సద్వినియోగం చేసుకొని ఎదిగే బాధ్యత ప్రతి ఒక్క సభ్యుడి మీద ఉందన్నారు. ఈ సందర్భముగా మేడ్చల్ జిల్లాతో పాటు ఇతర జిల్లాలలో సహకార పరపతి సంఘాలు సాధించిన విజయాలను ప్రశంసించారు. రంగారెడ్డి జిల్లా చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలలో కూరగాయలు, పండ్ల సాగును ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిదీ , ఆదేవిధంగా వ్యవసాయంలో ఎరువులు, రసాయనాల వాడకాన్ని తగ్గించి, సేంద్రీయ వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి సహకార సంఘం తీసుకోవల్సిందిగా సూచించారు.

రైతులకు మట్టినమూనాలు, విత్తనాలు, యంత్ర పరికరాలు, ఎరువులు, నిల్వ ప్రాసెసింగ్, మార్కెటింగ్, డైరి, పౌల్ట్రీ ఇలా అన్నీ రంగాలలో వాటి సేవలను విస్తరించే విధంగా బిజినెస్ మోడల్ రూపకల్పన చేసుకోవాలన్నారు. అదే విధంగా సంఘ సమావేశాలలో ఆయరంగాల్లో నిష్ణాతుల సేవలను ఆహ్వానించి, వారి సలహాలు, సూచనలు పొంది సంఘ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈసమావేశంలో ఎన్​సీడీసీ రీజనల్ డైరెక్టర్ శార్దూల్ , టీజీ కో ఆపరేటివ్ యూనియన్ ఛైర్మన్ మోహన రెడ్డి , టీజీ కాబ్​ఛైర్మన్ రవీందర్ రావుతో పాటు డిసీసీబీ ఛైర్మన్ లు, కోఆపరేటివ్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story