- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మత్తు మహమ్మారిపై ఉక్కుపాదం: 20 రోజుల్లో 1,218 నాటుసారా కేసులు నమోదు
తెలంగాణలో నాటుసారా, గంజాయి, సింథటిక్ డ్రగ్స్ అక్రమ రవాణాపై ఎక్సైజ్, STF, DCA అధికారులు ఉక్కుపాదం మోపారు. కే

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మత్తు మహమ్మారిని చిత్తు చేస్తున్నారు. నాటుసారా, గంజాయి, సింథటిక్ డ్రగ్స్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా వస్తున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కట్టడికి ఎక్సైజ్ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ, స్పెషల్ టాస్క్ ఫోర్స్, డ్రగ్ టాస్క్ ఫోర్స్, డ్రగ్ కంట్రోల్ అథారిటీ విభాగాల అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పల్లెలు, తండాలను పట్టి పీడిస్తున్న నాటుసారా తయారీ, రవాణాపై ప్రధానంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లోని కొన్ని మారుమూల తండాల్లో ఇంకా తయారీ కొనసాగుతున్నదని గుర్తించి కట్టడి చేస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ డైరెక్టర్ అంజన్‌రావు పర్యవేక్షణలో 20రోజుల్లోనే నాటుసారా తయారీదారులు, విక్రేతలపై ఏకంగా 1,218 కేసులు నమోదు చేశారు. 4,643 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. తయారీకి సిద్ధంగా ఉంచిన 69,220 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. అలాగే 45,994 కిలోల బెల్లాన్ని సీజ్ చేసి అక్రమార్కుల నడ్డివిరిచారు.
ఫార్మా, కెమికల్ కంపెనీల్లో తనిఖీలు
సింథటిక్ డ్రగ్స్, కల్తీ కల్లు తయారీకి వినియోగించే ఆల్ప్రజోలామ్, ఫెంటనిల్, మెఫెడ్రోన్ లాంటి ప్రమాదకర రసాయనాలపై డీసీఏ, ఎస్టీఎఫ్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని సుమారు 15 ఫార్మా, కెమికల్ కంపెనీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ తయారీకి అవకాశం ఉన్న రసాయనాల నిల్వలు, వినియోగం, విక్రయాలపై ఆరాతీశారు. అధికారుల ఆకస్మిక తనిఖీలు ఫార్మా, పరిశ్రమవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్న బార్లపైనా అధికారులు కొరడా ఝుళిపించారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఎస్టీఎఫ్ బృందాలు ఏకంగా 47బార్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. నిబంధనలు అతిక్రమించినట్టు గుర్తించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించాయి.
అక్రమ మద్యం కట్టడి
ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడుతున్న ఎన్డీపీఎల్, డిఫెన్స్ లిక్కర్, మిక్సింగ్ లిక్కర్ల కట్టడికి ఎస్టీఎఫ్, డీటీఎఫ్ బృందాలు సరిహద్దులు, చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాయి. ఇటీవలి దాడుల్లో 556 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. అలాగే 244 కిలోల గంజాయితో పాటు, ఎండీఎంఏ డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు తావులేకుండా చేయాలన్న ప్రభుత్వ కఠిన ఆదేశాలతో మత్తు పదార్థాలపై రాజీలేని పోరాటం చేస్తామని, రానున్న రోజుల్లో ఈ దాడులు మరింత ఉధృతంగా కొనసాగుతాయని ఎక్సైజ్, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అవినాశ్ మహంతి స్పష్టం చేశారు.






