- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవాస్తవాలు మాట్లాడొద్దు.. చామల కిరణ్ కుమార్ రెడ్డికి సీపీఎం జాన్‌వెస్లీ కౌంటర్
ఖమ్మంలోని వెలుగుమట్లలో దాదాపు 700 కుటుంబాలు 10 ఏళ్లుగా భూదాన్ భూముల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న వారిని బయటకు పంపించి ఇండ్లను కూల్చేశారని సీపీఎం మండిపడింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఖమ్మం పట్టణంలోని వెలుగుమట్ల గ్రామంలో దాదాపు 700 కుటుంబాలు 10 ఏళ్లుగా భూదాన్ భూముల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని నివసిస్తుంటే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది మంది పోలీసులతో, బుల్డోజర్‌లతో బలవంతంగా కుటుంబాలను బయటకు పంపించి ఇండ్లను కూల్చేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు. ఖమ్మం ఘటనలో కేరళ సీఎం విజయన్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇదంతా అవాస్తవమని, కేరళ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర రాజకీయాలు, ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారనడం సరైంది కాదన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఖండించారు.
వాస్తవంగా వెలుగుమట్లలో ఎంత విధ్వంసం జరిగిందో, కుటుంబాలు ఎన్ని ఇబ్బందుల పాలవుతున్నారో రాష్ట్ర ప్రజానీకానికి తెలుసన్నారు. శిబిరాల్లో ఉన్న వారికి కనీస సౌకర్యాలు కూడా లేవనే విషయం మీడియాలో, పత్రికల్లో వస్తున్నది.. అక్కడ వెళ్ళిన మీడియా ప్రతినిధుల కూడా అరెస్టు చేసి, నిర్భంధిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సీపీఎం పార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్నది వాస్తవం కాదా? ఆ ఎంపీకి ఆ పోరాటాలు కనపడటం లేదా? వినపడటం లేదా? ఊహాగానాలతో మాట్లాడటం సమంజసం కాదు.. అని మండిపడ్డారు. అవాస్తవాలను మాట్లాడటం సరైంది కాదు.. ఇప్పటికైనా అక్కడున్నటువంటి పేదలకు అక్కడే ఇండ్లు నిర్మించి, స్థిర నివాసం ఏర్పాటు చేయాలి.. అని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఇలాంటి అవాస్తవాలను మాట్లాడి ప్రజలను మభ్య పెట్టదలచుకుంటే తప్పకుండా ప్రజలు తెలంగాణ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.






