CPM: అంబర్‌పేట్‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ దౌర్జన్యం..! సీపీఎం హెచ్చరిక

by Ramesh Naini |

సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడైన మహేందర్‌పై అంబర్‌పేట్‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆరోపించింది.

CPM: అంబర్‌పేట్‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ దౌర్జన్యం..! సీపీఎం హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: (CPM) సీపీఎం హైదరాబాదు సెంట్రల్‌సిటీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడైన మహేందర్‌పై అంబర్‌పేట్‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ (Kaleru Venkatesh) అనుచిత వ్యాఖ్యలు చేశారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. అనునిత్యం ప్రజల్లోనే ఉంటూ, ప్రజల తరపున పోరాటం చేస్తున్న సీపీఎం నాయకులపై దౌర్జన్యాలకు పాల్పడితే ప్రజల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు మంగళవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ (CPM State Secretary John Wesley) ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ రోజు అంబర్‌పేట్‌ ఏరియాలో వరద బాధితులకు పురుగులతో కూడిన బియ్యాన్ని ఎమ్మెల్యేతో పాటు, అధికారులు పంచుతుండగా మహేందర్‌, సీపీఎం నాయకులు, కార్యకర్తలు అడ్డుకుని నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారని తెలిపారు. దీన్ని జీర్ణించుకోలేని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ నోటికొచ్చినట్టు బూతులు తిడుతూ, అక్కడి నుంచి ఈడ్చుకెళ్ళాలని, తర్వాత వాని అంతు చూస్తానని మహేందర్‌ను బెదిరించడం సరైందికాదన్నారు. ప్రజాప్రతినిధిగా ఉండి, ప్రజాస్వామ్యబద్దంగా ఉండాల్సిన ఎమ్మెల్యే సీపీఎం నాయకునిపై ఇలాంటి బెదిరింపులకు పాల్పడడం సరైందికాదని హితువు పలికారు. సీపీఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇలాంటి బెదిరింపులకు, దౌర్జన్యాలకు భయపడే వారు కాదు.. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే తీవ్ర మూల్యం చెల్లించక తప్పదని ఎమ్మెల్యే వెంకటేశ్‌ను హెచ్చరించారు.

Next Story