- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తలండి శ్రావణిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.. సీఎంకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి లేఖ
కుల దురహంకారంతో తలండి శ్రావణి హత్యకు గురైనందున ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కుల దురహంకారంతో తలండి శ్రావణి (నిండు గర్భిణి) హత్యకు గురైనందున ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖలో పేర్కొన్నారు. కుల, మతాంతర వివాహితుల రక్షణ చట్టం తేవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొమురం భీం జిల్లా, దహెగాం మండలం, గెర్రె గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ తలండి శ్రావణి (21), అదే గ్రామం బీసీ కులానికి చెందిన శివార్ల శేఖర్ 2024 అక్టోబర్ 10న బెల్లంపల్లిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. శేఖర్ తండ్రి శివార్ల సత్తయ్య, వారి కుటుంబ సభ్యులు ఈ కులాంతర వివాహాన్ని అంగీకరించలేదు. దీనితో ఈ జంట శ్రావణి తండ్రి చెన్నయ్య ఇంట్లోనే కాపురం ఉంటున్నారు. అక్టోబర్ 18న ఉదయం 11 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రావణి మామ శివార్ల సత్తయ్య వారి కుటుంబ సభ్యుల (శివార్ల కుమార్, శివార్ల కవిత)తో కలిసి 9 నెలల నిండు గర్భిణీ అని కూడా చూడకుండా శ్రావణి కడుపులో, మర్మాంగంలో కత్తితో పొడిచాడు. ప్రాణభయంతో పరుగెత్తిన శ్రావణిని వెంటాడి గొడ్డలితో తల నరికి నడి వీధిలో హత్య చేశాడు. బిడ్డకు జన్మ ఇవ్వకూడదనే తలంపుతోనే ఈ కుల దురహంకార హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో శ్రావణి భర్త శేఖర్‌తో సహా హత్యకు పథకం ప్రకారం శ్రావణి తల్లిదండ్రులను ఉదయాన్నే పొలం పనుల పేరుతో బలవంతంగా వాహనంలో తీసుకెళ్ళాడు. ఈ కుల దురహంకార హత్య జరిగి 14 రోజులు గడుస్తున్నా జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇప్పటి వరకు ఆ గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబానికి భరోసా కల్పించలేదు.
ఈ నేపథ్యంలో మా పార్టీ ప్రతినిధి బృందంతో వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించాం. శ్రావణిది ఇల్లు, భూమి లేని నిరుపేద కుటుంబం. తక్షణమే మీరు ఈ ఘటనపై విచారణ జరిపించి, శ్రావణి మామ శివార్ల సత్తయ్య, భర్త శివార్ల శేఖర్, కుటుంబ సభ్యులు శివార్ల కుమార్, శివార్ల కవితలపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం తల్లి, బిడ్డలను హత్య చేసిన కేసు నమోదు చేయాలి. ఫ్రాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి 6 నెలల్లో శిక్షించాలి. బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియో, 5 ఎకరాల భూమితో పాటు, ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. జిల్లా కలెక్టర్, ఎస్పీ వెంటనే ఆ గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు 140 పైగా కుల దురహంకార హత్యలు జరిగాయి. ఇవి ఇంకా కొనసాగే ప్రమాదకర పరిస్థితులున్నాయి. ఇలాంటి దారుణాలను అరికట్టేందుకు ప్రభుత్వమే అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, కుల, మతాంతర వివాహితుల రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు.






