కుల, మతాంతర వివాహితుల రక్షణ చట్టం తీసుకురావాలి : CPM రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్

by Ramesh Naini |

కుల దురహంకార హత్యపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.

కుల, మతాంతర వివాహితుల రక్షణ చట్టం తీసుకురావాలి : CPM రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కుల దురహంకార హత్యపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ (CPM State Secretary John Wesley) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కొమురంభీం–ఆసిఫాబాద్ జిల్లా, దహెగాం మండలం, గెర్రె గ్రామంలో జరిగిన కుల దురహంకార హత్యను సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు. ఎస్టీ (కోయ) కులానికి చెందిన తలండి శ్రావణ రాణి, అదే గ్రామానికి వెనుకబడిన కులానికి చెందిన శివార్ల శేఖర్ ఇద్దరూ తల్లిదండ్రులను ఎదిరించి సంవత్సరం క్రితం కులాంతర వివాహం చేసుకున్నారని తెలిపారు.

శేఖర్ తండ్రి సత్తయ్య ఈ వివాహాన్ని జీర్ణించుకోలేక తలండి శ్రావణ రాణిని గొడ్డలితో నరికి అత్యంత దారుణంగా హత్య చేశాడని, రాణి నిండు గర్భిణిగా ఉన్నప్పటికీ ఈ ఘాతుకానికి పాల్డటం సభ్య సమాజాన్ని కలచి వేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకుండా, వాటిని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందని పేర్కొన్నారు, కుల, మతాంతర వివాహితుల రక్షణ చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి హత్యలు జరుగకుండా ప్రభుత్వం ప్రజల్లో సామాజిక చైతన్యం కలిగించే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story